జర్నలిస్టు కొడుకు దారుణ హత్య

16 Apr, 2019 19:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పట్నా : బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. నలందకు చెందిన ఓ జర్నలిస్టు కుమారుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ కేసును విచారించేందుకు నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. వివరాలు.. అశుతోష్‌ కుమార్‌ ఆర్య అనే వ్యక్తి దైనిక్‌ హిందుస్తాన్‌ నలంద బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఈయన కుమారుడు అశ్విన్‌ కుమార్‌(15) మనోవైకల్యంతో బాధపడుతున్నాడు. తన నానమ్మతో కలిసి హర్నత్‌ అనే గ్రామంలో నివసిస్తున్న అశ్విన్‌..ఆదివారం మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయాడు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అశ్విన్‌ కళ్లు పీకేసీ దారుణంగా హతమార్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ విషయం గురించి నలంద ఎస్పీ నీలేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ అతడు ఎలా చనిపోయాడన్న విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజాలు బయటకు వస్తాయి. అయితే కొన్నిసార్లు అశ్విన్‌ విచిత్రంగా ప్రవర్తించేవాడని అతడి తండ్రి చెప్పారు. ఈ క్రమంలోనే అతడిపై దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నాం. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చు’ అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అశుతోష్‌ కుమార్‌ భద్రత కోసం ప్రత్యేకంగా ఓ బాడీగార్డును నియమించినట్లు సిట్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

మరిన్ని వార్తలు