సినీ సంస్థలపై కేసు నమోదు

9 Jan, 2020 07:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనుమతులకు విరుద్ధంగా గడువు ముగిసిన తరువాత కూడా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా శ్రేయాస్‌ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ మేనేజర్‌ యగ్నేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్‌ గూడ బెటాలియన్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురంలో’ సినిమా మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహించారు. కార్యక్రమానికి సినిమా హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, పూజాహెగ్డేతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, చిన్నబాబు హాజరయ్యారు. కాగా ఇందుకు సంబందించి ఈ నెల 2న హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ మేనేజర్‌ కె.యగ్నేష్‌ పోలీసుల అనుమతి తీసుకున్నారు. వేడుకలకు దాదాపు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని అతను పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నాడు.

శ్రేయాస్‌ మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమం 11.30 గంటల వరకు కొనసాగింది. గంటన్నర అదనంగా కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్‌లు ఇచ్చామని చెప్పిన నిర్వాహకులు దాదాపు 15వేల మందిని ఆహ్వానించినట్లుగా గుర్తించారు. ఈ కారణంగా వేడుకలో తొక్కిసలాట జరగడమేగాక వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో యూసుఫ్‌గూడ రహదారులు కిక్కిరిశాయి. పోలీసులు వీరిని నియంత్రించలేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం తీవ్ర అసౌకర్యానికి, ఉద్రిక్తతకు దారితీసిందని తొక్కిసలాట జరిగిందని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ నవీన్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రేయాస్‌ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు యగ్నేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అల్లు అర్జున్‌ భావోద్వేగం)

మరిన్ని వార్తలు