సారూ.. ఆ ఫోనెక్కడ..?

18 Jan, 2020 07:57 IST|Sakshi

దాచేశాడా.. పారేశాడా..?

కీలకంగా మారిన జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సెల్‌ ఫోన్‌

సాక్షి, బంజారాహిల్స్‌:  ఓ కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పిస్తామని లోక్‌ అదాలత్‌లో కేసును కాంప్రమైజ్‌ చేయిస్తామంటూ నిందితుడి నుంచి రూ.50 వేలు లంచం, రెండు వ్యాట్‌ 69 మద్యం బాటిళ్లు తీసుకుంటూ పట్టుబడిన జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య తన అధికారిక ఫోన్‌ ఎక్కడ దాచాడన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ నెల 9న జూబ్లీహిల్స్‌రోడ్‌ నెం. 10సీలో వంశీకృష్ణ అనే వ్యక్తి నుంచి ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య ఆదేశాల మేరకే నగదు తీసుకున్నట్లు  వెల్లడించాడు. ఈ విషయం తెలియడంతో బలవంతయ్య స్టేషన్‌కు రాకుండానే అటు నుంచి అటే జారుకున్నాడు. అయితే తన అధికారిక ఫోన్‌(9490616585)ను మాత్రం ఆ తెల్లవారే ఏసీబీ అధికారుల ఎదుట సరెండర్‌ అయిన సమయంలో అప్పగించలేదు. ఫోన్‌ విషయమై ప్రశ్నించగా తన అధికారిక పోలీస్‌ వాహనంలోనే ఉంచినట్లు తెలిపాడు.(ఏసీబీ ఎదుట లొంగిపోయిన బల్వంతయ్య..)

సదరు వాహనంలో గాలించిన పోలీసులు ఫోన్‌ కనిపించకపోవడంతో రెండు గంటల పాటు విచారించినా వెల్లడించలేదు. సుదీర్‌రెడ్డి నుంచి లంచం తీసుకున్న వెంటనే సీఐ ఫోన్‌ ట్రాప్‌ చేయించడంతో, ఆ కాల్‌డేటా అందులో ఉండిపోవడం వల్ల ఏసీబీకి అది కీలకంగా మారింది. సదరు ఫోన్‌ దొరికితే కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలు లభ్యమవుతాయి. ఫోన్‌ దొరక్కపోతే చాలా ఆధారాలు మరుగునపడే ప్రమాదం ఉన్నందున ఏసీబీ అధికారులు దాని కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఫోన్‌ నిజంగానే కారులో మర్చిపోయాడా..?లేక ఎక్కడైనా పడేశారా..? మరెక్కడైనా దాచారా అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌లోనూ ఏసీబీ అధికారులు ఈ ఫోన్‌ విషయమై ఆరా తీశారు. బలవంతయ్యకు చెందిన వనస్థలిపురం ఇంట్లో, ఆయన మరో ఇంట్లోనూ ఈ ఫోన్‌ కోసం ఏసీబీ గాలించింది. అయితే అధికారిక రివాల్వర్‌ మాత్రమే లభ్యమైంది. ఫోన్‌ ఆచూకీ తెలియక పోవడంతో వారం రోజులుగా పలు ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు.
చదవండి : ఏసీబీ వలలో ‘మూడు అవినీతి చేపలు’

మరిన్ని వార్తలు