సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారు

5 Sep, 2019 07:56 IST|Sakshi

అర్ధరాత్రి ఫిలించాంబర్‌ గేటుకు కట్టేసుకుని యువతి ఆందోళన

బంజారాహిల్స్‌: సినిమా అవకాశాల పేరుతో ప్రముఖ దర్శకుడు బన్ని వాసు తనను మోసం చేశారని, జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పిన ఆ పార్టీ నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ జూనియర్‌ ఆర్టిస్ట్‌ సునీత బోయ బుధవారం తెల్లవారుజామున ఫిలించాంబర్‌ గేటుకు తనను తాను  గొలుసులతో బంధించుకొని నిరసన తెలిపింది. దీనిని గుర్తించిన సెక్యురిటీ గార్డు పోలీసులకు సమాచారం అందిచడంతో బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపిచేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించింది. తనకు జరిగిన మోసంపై సినీ నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించి అక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది. గతంలో తాను శ్రీరెడ్డికి సోషల్‌ మీడియా వేదికగా జనసేన తరపున కౌంటర్‌ ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు.

బన్నీవాసు సినిమా అవకాశాల పేరుతో తనను ఎన్నోసార్లు కార్యాలయానికి పిలిపించారని ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ లైవ్‌ద్వారా తనకు జరిగిన అన్యాయాలను వివరించింది. తనపై తప్పుడు ప్రచారం చేసి పోలీస్‌ స్టేషన్‌కు పంపించిన వారు ఫిలిం ఇండస్త్రీ నుంచి బ్యాన్‌ చేయిస్తామని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ బ్యానర్‌ ఏర్పాటు చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని పవన్‌కళ్యాణ్‌ దృష్టికి వెళ్లాలనే ఇలా చేసినట్లు తెలిపింది. మూడు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సునీతను ఎట్టకేలకు గొలుసులు తొలగించి స్టేషన్‌కు తరలించారు. ఆమెపై మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో  ఆరు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కొందరిపై కేసులు పెట్టి సెటిల్మెంట్లు చేసుకున్న వ్యవహారాలు తమ దృష్టికి వచ్చాయని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 
 

చేతినిండా పవన్‌ కల్యాణ్‌ పేరు
తనకు పవన్‌ కళ్యాణ్‌ అంటే పిచ్చి అభిమానమనీ అందుకే చేతుల నిండా పవన్‌ కల్యాణ్, జనసేన పేర్లు పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు సునీత తెలిపింది. 

మరిన్ని వార్తలు