చుక్కేసి.. చిక్కేసి!

24 Jun, 2020 06:35 IST|Sakshi

మద్య నిషేధం అమల్లో ఉన్నచోట మందు పార్టీ

గుజరాత్‌లో ‘పార్టీ’ చేసుకున్న జూ.డా.లు

హైదరాబాదీ సహా మొత్తం 12 మంది కటకటాల్లోకి..

అరెస్ట్‌ అయినవారిలో ఐదుగురు యువతులు సైతం

సాక్షి, సిటీబ్యూరో: మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లోని వడోదరలో కొందరు జూనియర్‌ డాక్టర్లు మందు పార్టీ చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వఘోడియా పోలీసులు దాడి చేసి మొత్తం 12 మంది జూనియర్‌ డాక్టర్లను అరెస్టు చేశారు. వీరిలో ఓ హైదరాబాదీతో పాటు ఐదుగురు యువతులు ఉన్నట్లు వఘోడియా పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి వడోదర రూరల్‌ పరిధిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గుజరాత్‌లో పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలులో ఉంది. బయటి రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారికి సైతం అధీకృత లేఖ ఆధారంగా మాత్రమే పరిమితంగా మద్యం విక్రయిస్తారు. ఆ రాష్ట్రంలోని వడోదర రూరల్‌ పరిధిలో ఉన్న సుమన్‌దీన్‌ విద్యాపీఠ్‌Š‡తో పాటు దీని అనుబంధ వైద్యశాల సుమన్‌దీప్‌ ఆస్పత్రిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు విద్యనభ్యసిస్తున్నారు.

వీరిలో కొందరు సదరు ఆస్పత్రిలో పని చేసే జూనియర్‌ డాక్టర్లు కూడా ఉన్నారు. గుజరాత్‌లోని మీన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన జైమన్‌ మెహతా, ఘట్లోడియా వాసి కిరణ్‌ మెహతా సైతం జూనియర్‌ డాక్టర్లుగా పని చేస్తున్నారు. తన సహచరులైన పది మందితో కలిసి మద్యం పార్టీ చేసుకోవాలని భావించారు. దీంతో ఆదివారం రాత్రి వడోదర రూరల్‌ పరిధిలోని ఆమోదర్‌ గ్రామంలో ఈ ద్వయం నివసించే శ్యామల్‌ కౌంటీలో ఉన్న హౌస్‌ నంబర్‌ 112 ఈ పార్టీకి వేదికైంది. ఇందులో ఐదుగురు యువతులు సహా 12 మంది జూనియర్‌ డాక్టర్లు మద్యం తాగుతున్నారు. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వాళ్లు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. దాడి చేసిన వఘోడియా పోలీసులు డజన్‌ మందినీ అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ ఇంటి నుంచి దేశీ, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ వాసులతో పాటు హైదరాబాద్‌కు చెందిన జూనియర్‌ డాక్టర్‌ కోషి జోసెఫ్‌ ఉన్నట్లు వఘోడియా ఎస్‌ఐ పి.పార్మర్‌ ప్రకటించారు. 12 మంది జూనియర్‌ డాక్టర్లను అరెస్టు చేసి, స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు