జ్యోత్స్న మృతిపై దర్యాప్తు ముమ్మరం

18 Apr, 2019 11:38 IST|Sakshi
జ్యోత్స్న మృతదేహం (ఫైల్‌)

విద్యార్థులు, ఫ్యాకల్టీని విచారించిన పోలీసులు

జ్యోత్స్న ఫోన్‌లోని సమాచారంపై ఆరా

విశాఖపట్నం , సీతమ్మధార(విశాఖ ఉత్తర): నగరంలోని బుల్లయ్య కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మల్కాపురం దరి జనతా కాలనీకి చెందిన జ్యోత్స్న మృతిపై ఫోర్తుటౌన్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కయ్యపాలెం శాంతిపురం దరి కట్టా ఎన్‌క్లేవ్‌లోని ఫోర్తుప్లోర్‌లోని ప్లాట్‌లో జ్యోత్స్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌లో బిహార్‌కు చెందిన అంకోర్‌తోపాటు అతని స్నేహితుడు, మరో లెక్చరర్‌ పవన్‌ ఉంటున్నాడు. దీంతో ఇప్పటికే వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా జ్యోత్స్న ప్లాట్‌లోకి వెళ్లేటప్పటికి ఎవరున్నారు..? ఆమె ఆత్మహత్య చేసుకునే సమయంలో అంకోర్, పవన్‌ ఎక్కడున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

అసలు ఆ రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు ఇప్పటికే అపార్టుమెంట్‌ వాసులతో పాటు వాచ్‌మెన్‌ను విచారించారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం ఉదయం బుల్లయ్య కళాశాలకు సీఐ రవి వెళ్లారు. అక్కడి జ్యోత్స్న స్నేహితురాళ్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మరోవైపు మృతురాలి ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, చాటింగ్‌కు సంబంధించిన వివరాలు సేకరించి దర్మాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు ముందు జ్యోత్స్న ఎవరెవరికి ఫోన్‌ చేసింది..? అన్న వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. మంగళవారం పోస్టుమర్టం పూర్తి కావడంతో ఇంకా రిపోర్టు రావాలసి ఉందని సీఐ రవి తెలిపారు. అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు