పెళ్లి ప్రస్తావన రాగానే చంపేశాడు

24 Feb, 2019 06:01 IST|Sakshi
శ్రీనివాస్‌, అంగడి జ్యోతి , పవన్‌కల్యాణ్‌

ప్రేమ పేరుతో నమ్మించి జ్యోతిని హతమార్చిన శ్రీనివాస్‌

మరికొందరు అమ్మాయిలతోనూ శ్రీనివాస్‌కు సంబంధాలు

శ్రీనివాస్‌ ఫోన్‌లో యువతుల న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు

ఫేస్‌బుక్‌లో 80 మందికి పైగా యువతులతో చాటింగ్‌ 

జ్యోతి హత్యకేసులో నిందితులు శ్రీనివాస్, పవన్‌కల్యాణ్‌ అరెస్ట్‌

సాక్షి, గుంటూరు/గుంటూరు: సంచలనం సృష్టించిన అంగడి జ్యోతి హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న రాజధాని ప్రాంతం మంగళగిరి మండలం నవులూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్‌ స్టేడియం దగ్గరలోని నిర్మానుష్య ప్రదేశంలో అంగడి జ్యోతి (25) హత్యకు గురైన విషయం తెలిసిందే. జ్యోతి ప్రియుడు శ్రీనివాస్‌ ఈ హత్యకు పాల్పడినట్లు గుంటూరు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు చెప్పారు. శ్రీనివాస్‌ వద్ద పనిచేసే పవన్‌ ఈ హత్యకు సహకరించాడన్నారు. జ్యోతి కేసులో ముద్దాయిలు చుంచు శ్రీనివాస్, కటారి పవన్‌కల్యాణ్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

పెళ్లి కోసం ఒత్తిడి చేసిందని: చుంచు శ్రీనివాస్‌ రోడ్డు మరమ్మతుల కాంట్రాక్టు పనులు చేస్తుండేవాడు. అతను, అదే ప్రాంతానికి చెందిన అంగడి జ్యోతి ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జ్యోతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో శ్రీనివాస్‌ పెళ్లి విషయాన్ని దాటవేస్తున్నాడు. పెళ్లి విషయమై గట్టిగా అడగడం మొదలు పెట్టిన జ్యోతి.. తేడా చేస్తే పోలీస్‌ కేసు పెడతానని బెదిరించింది. ఏదో రకంగా జ్యోతి అడ్డు తొలగించుకోవాలని, ఈ విషయాలన్నీ తన వద్ద పనిచేసే కటారి పవన్‌కల్యాణ్‌కు చెప్పి తనకు సహాయం చేయాలని శ్రీనివాస్‌ కోరాడు. 11వ తేదీ మధ్యాహ్నం 12.30కు జ్యోతి తన సర్టిఫికెట్ల కోసం తాడేపల్లి నుంచి గుంటూరు చుట్టుగుంట ప్రియదర్శిని ఫార్మా కళాశాలకు వెళ్లి.. తాను గుంటూరుకు వచ్చినట్లు 1.21 గంటలకు శ్రీనివాస్‌కి ఫోన్‌ చేసింది. మంగళగిరిలో కలుసుకుందామని శ్రీనివాస్‌ చెప్పాడు. ఈ విషయం పవన్‌కు ముందే చెప్పిన శ్రీనివాస్‌ ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. పవన్‌ బైక్‌పై వచ్చిన శ్రీనివాస్‌.. జ్యోతిని మంగళగిరిలో కలుసుకున్న తదుపరి నెట్‌ సెంటర్‌లో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని యర్రబాలెం–నవులూరు గాంధీబొమ్మ సెంటర్‌లోని నూడిల్స్‌ పాయింట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లి.. పథకం ప్రకారం పవన్‌ను అక్కడికి రప్పించాడు. పవన్‌ తన చేతిలో ఉన్న రాడ్డుతో జ్యోతి తలపై గట్టిగా కొట్టాడు. అనంతరం దెబ్బ సరిగా తగిలిందో లేదోనని శ్రీనివాస్‌ కూడా ఆమె తలపై కొట్టాడు. దీంతో అమె అక్కడికక్కడే చనిపోయింది.
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు, చిత్రంలో నిందితులు 

అనుమానం రాకుండా..: అనుమానం రాకూడదని శ్రీనివాస్‌ తనకు యాక్సిడెంట్‌ అయిందని నాటకమాడాడు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి బెదిరించి జ్యోతిని తమతో పంపమని అడుగగా తాము అందుకు నిరాకరించామని, తమపై దాడి చేసి జ్యోతిని చంపారని శ్రీనివాస్‌ కట్టుకథ చెప్పాడు. హత్యకు గురైన జ్యోతితోనే కాకుండా శ్రీనివాస్‌ మరికొందరు యువతులతో సన్నిహితంగా ఉంటున్నాడు. శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌లో యువతుల న్యూడ్‌ ఫొటోలు, వీడియోలున్నాయి. ఫేస్‌బుక్‌లో 80 మందికి పైగా యువతులతో శ్రీనివాస్‌ చాటింగ్‌ చేశాడని ఎస్పీ వివరించారు. 

జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలి
జ్యోతి తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాల నాయకులు శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయానికి చేరుకున్నారు. జ్యోతి తల్లిదండ్రులు అంగడి చిన్నగోవిందు, దుర్గ మాట్లాడుతూ తమ కుమార్తెను నమ్మించి మోసం చేసి దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నార్త్‌ డీఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించి పోస్టుమార్టం చేసేందుకు వచ్చిన వైద్యురాలిని అడ్డుకున్న కారణంగానే ఖననం చేసిన తమ కుమార్తె మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో తమకు పోలీస్‌ శాఖపైనే నమ్మకం సడలుతోందన్నారు. సంఘటన స్థలంలో తమ కుమార్తెకు చెందిన సెల్‌ఫోన్, పర్స్, చెప్పులు ఏమయ్యాయనే విషయాలు పోలీసులు వెల్లడించలేదన్నారు. జుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తే పూర్తి స్థాయిలో వివరాలు బహిర్గతమవుతాయని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు