జ్యోతి హత్యకేసులో వీడని మిస్టరీ

25 Apr, 2019 12:17 IST|Sakshi
జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళన చేస్తున్న బంధువులు (ఫైల్‌)

 ఆధారాలు సేకరించడంలో పోలీసుల నిర్లక్ష్యం

నేటికీ దొరకని సెల్‌ఫోన్, పర్స్, ఇతర వస్తువులు

సీఐ బాలాజీ దగ్గరే ఉన్నాయంటున్న బంధువులు

కేసును పక్కదోవ పట్టించేందుకే  ప్రయత్నాలని ఆరోపణ

తాడేపల్లిరూరల్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన జ్యోతి హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం కారణంగా దోషులు తప్పించుకునే అవకాశం ఉందంటూ బంధువులు మొదటినుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. చివరకు అదే జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతిని నమ్మించి ప్రియుడైన చుంచు శ్రీను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి అతి కిరాతకంగా చంపాడు. ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొని జ్యోతిని హత్యచేసి, తనను గాయపరిచారంటూ  ఓ సినిమా స్టోరీని అల్లాడు. దానికి పోలీసులు సైతం సహకరించడంతో పసిగట్టిన బంధువులు ఆందోళన నిర్వహించడం, ఆ తర్వాత ప్రియుడ్ని అదుపులోకి తీసుకోవడం, పోలీసు విచారణలో చుంచు శ్రీను తనే నేరం చేశానని  ఒప్పుకున్నాడు. దీంతో  పోలీసులు చుంచు శ్రీను, ఆయన స్నేహితుడైన పవన్‌పై కేసు నమోదు చేశారు. అప్పటినుంచి కేసుకు ధారాలు సేకరించకుండా పోలీసులు పక్కన పెట్టడంతో మరోసారి బంధువులు జిల్లాలోని కలెక్టర్‌తో పాటు, వివిధ శాఖల అధికారులను కలిసి తమకు న్యాయంచేయాలని కోరారు.

జ్యోతి హత్య జరిగి నేటికి 75 రోజులవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. జ్యోతి పోస్టుమార్టం నిర్వహించేటప్పుడే పోలీసులు ఆమె దుస్తులను సేకరించకపోవడం, పూర్తిస్థాయిలో పోస్టుమార్టం నిర్వహించకపోవడం అనుమానాలకు దారితీసింది. దీంతో జ్యోతి బంధువులు ఆందోళన నిర్వహించి, రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తిరిగి మరలా గుంటూరు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం నిర్వహించి, మొదట పోస్టుమార్టం జరగలేదని నిర్ధారించారు. అనంతరం చుంచు శ్రీనును అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య చేయడానికి ఉపయోగించిన రాడ్డును సీజ్‌ చేశారే తప్ప జ్యోతి వద్ద ఉన్న సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగ్, ఇతర వస్తువులను నేటికీ కూడా రికవరీ చేయలేదు. కేసులో కీలక ఆధారమైన సెల్‌ఫోన్‌ సీజ్‌ చేయకపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుందంటూ జ్యోతి సోదరుడు అంగడి ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిగులుతోనే మా తండ్రి చనిపోయాడని, ఎస్టీ (ఎరుకుల) కులానికి చెందిన మమ్ములను పోలీస్‌ అధికారులు తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పాడు.  కనీసం తమకు అందాల్సిన రాయితీలను కూడా ఇవ్వకుండా పోలీసులు వేధిస్తున్నారని పేర్కొన్నాడు.   చెల్లి హ్యాండ్‌బ్యాగ్, సెల్‌ఫోన్, సీఐ బాలాజీ దగ్గరే ఉన్నాయని, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే వాటిని రికవరీ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నాడు. ఇప్పటికైనా పోలీసులు జ్యోతి కుటుంబానికి న్యాయం చేస్తారో లేదో వేచి చూడాల్సిందే!

మరిన్ని వార్తలు