శిథిలాల కింద తల్లి.. ఆమె ఒడిలో క్షేమంగా శిశువు

27 Aug, 2019 09:01 IST|Sakshi

అమ్మ త్యాగం

కూలిన పాత మిద్దె

శిశువును ఒడిలో దాచుకుని బాలింత ప్రాణత్యాగం

అవ్వ, తల్లీ, కొడుకు మృతి

శిశువు క్షేమం    

అమ్మ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన మరో ఘటన ఇది. ఇల్లు కూలి శిథిలాలు తన ప్రాణాన్ని కబళిస్తున్నా, నెలరోజుల బిడ్డ బతుకును కాపాడడానికి ఆ తల్లి విశ్వప్రయత్నం చేసింది. బిడ్డను కాపాడుకున్నా తాను మాత్రం విధికి బలైంది. మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించగా, శిథిలాల కింద తల్లి ఒడిలో శిశువు క్షేమంగా ఉంది. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది. 

సాక్షి, బెంగళూరు ‌: బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని నాడంగ గ్రామంలో ఆదివారం రాత్రి పాత మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను ఇమామ్‌బీ (40), ఆమె కూతురు హసీనా(25), మనవడు ఇమ్రాన్‌(3)గా గుర్తించారు. వివరాలు... హసీనాకు రాయచూరు జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన బాషాతో వివాహమైంది. నెల క్రితం రెండవ కాన్పు కోసం హసీనా కొడుకు ఇమ్రాన్‌ను తీసుకుని నాడంగలోని పుట్టింటికి వచ్చింది. నెలకిందట మగపిల్లాడు జన్మించాడు. రాత్రి భోజనం చేసి నిద్రిస్తుండగా ఇటీవల వర్షాలకు నానిన ఇంటి మిద్దె కూలి మీద పడింది. తల్లి హసీనా శిశువుకు అపాయం లేకుండా ఒడిలో దాచుకుని తాను శిథిలాల కింద ప్రాణాలను విడిచింది. భారీ శబ్ధం రావడంతో అనుమానంతో గ్రామస్తులు స్థలానికి చేరుకొని కూలిన మట్టిని, కర్రలను తొలగించి చూడగా శిశువు మాత్రం కొన ఊపిరితో బతికి ఉండగా, ముగ్గురు అక్కడికక్కడే విగతజీవులై ఉన్నారు. వెంటనే బిడ్డను ఆస్పత్రికి తరలించారు. తన ప్రాణం పోతున్నా బిడ్డను కాపాడుకున్న తల్లి త్యాగాన్ని చూసి గ్రామస్తులు సైతం కన్నీరుకార్చారు. 

ఉపాధి కోసం వెళ్లిన ఇంటిపెద్ద  
నిరుపేదైన ఇమామ్‌బీ భర్త ఖాదర్‌ జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్లాడు. అయితే ఈ దుర్ఘటన సమాచారం తెలుసుకొని బోరున విలపిస్తూ స్వగ్రామానికి చేరుకొన్నాడు. విధి ఒకేసారి అవ్వ, తల్లి, అన్నను కబళించడంతో నెల శిశువు ఒంటరివాడయ్యాడు. సోమవారం ఉదయం విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే సోమలింగప్ప సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై సిరుగుప్ప పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మౌనేష్‌ పాటిల్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు