మురపాకలో కబడ్డీ వివాదం

5 Sep, 2019 11:20 IST|Sakshi
తీవ్రంగా గాయపడిన పాపారావు, అశోక్‌, గాయపడిన గురయ్య, గాయపడిన రమణ

సాక్షి, లావేరు: మండలంలోని మురపాక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి కబడ్డీ టోర్నమెంటులో అంపైర్‌ ఏకపక్ష నిర్ణయాలతో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇది తీవ్ర స్థాయిలో ఘర్షణకు దారితీయగా ఒకరికొకరు భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలకు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలకు చెందిన 22 మందిపై కేసులు నమోదు చేశారు. లావేరు స్టేషన్‌ హెచ్‌సీ రమణ వివరాల ప్రకారం... వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఓ కాలనీలో కబడ్డీ టోర్నమెంటు నిర్వహించారు.

ఈ టోర్నమెంటులో అంపైర్‌ ఏకపక్షంగా వ్యవహరించడంతో ఓ జట్టు యువకులు ఆటను బహిష్కరించారు. దీంతో గ్రామానికి చెందిన రెండు కాలనీలకు చెందిన వారి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కాలనీకి చెందిన బొట్ట గురయ్య, వడ్డి రమణ, కోరాడ ఈశ్వరరావులకు గాయాలయ్యాయి. మరో కాలనీకి చెందిన గుడివాడ పాపారావు, రాకోటి అశోక్, మారుబారుకి గణేష్‌లకు గాయాలయ్యాయి. వీరిని శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లావేరు పోలీసులు మురపాక గ్రామానికి వెళ్లి ఇరువర్గాల నుంచి వివరాలను సేకరించారు.

22 మందిపై కేసుల నమోదు
పరస్పరం ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాలకు చెందిన 22 మందిపై కేసు నమోదు చేసినట్లు లావేరు ఎస్‌ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. ఓ వర్గానికి చెందిన వీ అప్పన్న, కే నాగరాజు, వీ లక్ష్మణ, బీ గురయ్య, వీ సూర్యనారాయణ, కే పాపారావు, జీ యర్రబాబు, వీ అప్పయ్యలపైనా, మరోవర్గానికి చెందిన జీ పాపారావు, బీ యర్రయ్య, పీ సూరిబాబు, ఎం చిన్న, ఎం అశిరినాయుడు, ఎం వెంకటరమణ, ఏ తేజ, ఆర్‌ గణేష్, ఆర్‌ చంటి, ఎం శ్రీహరి, ఆర్‌ సుధ, ఆర్‌ అశోక్, ఎం శ్రీనులపైనా కేసులు నమోదు చేశామన్నారు.

మరిన్ని వార్తలు