కబీర్‌సింగ్‌ ఎఫెక్ట్‌.. యువతిని చంపిన  టిక్‌టాక్‌ స్టార్‌

15 Oct, 2019 16:04 IST|Sakshi

‘కబీర్ సింగ్’ సినిమాపై ఇప్పటికీ ఎన్నో విమర్శలు తలెత్తాయి. తెలుగు సినిమా ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో లో మహిళలను తక్కువ చేసి చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్‌ లేని వ్యక్తిగా చూపించారని చాలా మంది విమర్శించారు. ఈ సినిమా గురించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, ఇటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తలపట్టుకుంటున్నారు. అయితే విమర్శలను కాదని కలెక్షన్లలో ఈ సినిమా దూసుకుపోయిది. సినిమా విడుదలై దాదాపు 4 నెలలు దాటినా.. కబీర్‌ సింగ్‌ టీమ్‌కు విమర్శలు తప్పడం లేదు. తాజాగా  ఈ చిత్ర యూనిట్‌కు మరో సమస్య వచ్చి పడింది. 

‘కబీర్ సింగ్’ చిత్రం ప్రభావంతో ఓ యువకుడు తాను ప్రేమించిన యువతికి పెళ్లికుదిరిన సంగతి తెలిసి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను చంపి... పోలీసులు పట్టుకుంటారన్న భయంతో తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశ్వని కుమార్ అలియాస్ జానీ దాదా అలియాస్‌ టిక్‌టాక్‌ విలన్‌ ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు తెలిపారు.
 
‘కబీర్ సింగ్’సినిమా చూసిన అశ్వనికుమార్ ఆ చిత్రంలోని షాహిద్‌ కపూర్‌ పాత్రలో ఫిదా అయిపోయాడు. ఆ పాత్రలో తనను తాను ఊహించుకోని.. హీరో లాగే చెడు అలవాట్లకు బానిసయ్యాడు. డ్రగ్స్‌ తీసుకొని  ఆ ఫోటోలను టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసేవాడు.  తానే విలన్‌నంటూ చేతిలో తుపాకితో వీడియోలు చేస్తూ ‘టిక్‌టాక్ విలన్’గా హల్‌చల్ చేసేవాడు. మరోవైపు ఆశ్వని  బిజ్‌నోర్‌కు చెందిన నికిత శర్మ(27) అనే యువతిని ప్రేమిం‍చాడు. ఆమె అతడి ప్రేమను అంగీకరించలేదు. అయినప్పటీకి ఆమెను అతను విడిచిపెట్టలేదు. ఆ సమయంలోనే నికిత చదువు పూర్తి చేసుకుని దుబాయ్‌కు వెళ్లి అక్కడ ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం చేస్తోంది.

ఇటీవల ఆమెకు పెళ్లి కుదిరింది. డిసెంబర్‌లో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న జానీ ఆమెపై పగ పెంచుకున్నాడు. తనకు దక్కని అమ్మాయి మరే అబ్బాయి సొంతం కాకూడదని భావించి ఆమెను చంపేందుకు కుట్రపన్నాడు.  డ్రగ్స్‌కు అలవాటు పడి ఉన్మాదిగా మారిన అతను ఆమె ఇంటికి వెళ్లి తుపాకితో కాల్చి చంపాడు.  అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.  వారం రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఓ బస్సులో ప్రయాణిస్తున్న అశ్వనిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బస్సులో ఉన్న అతను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ కేసును విచారించిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. జానీపై గతంలో మూడు హత్య కేసులు నమోదై ఉన్నాయట. అంతేకాదు అతని టిక్ టాక్ వీడియోల్లో అన్నీ కబీర్ సింగ్‌కి సంబంధించిన వీడియోలే ఉన్నాయి. 

కాగా, నికిత శర్మ హత్య ఘటనపై ‘కబీర్ సింగ్’  దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. ఈ ఘటన దురదృష్టకరమని.. ఆ యువతి కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు. ఎవరినీ చంపమని తన సినిమా చెప్పలేదని, ‘కబీర్ సింగ్’ గానీ, ‘అర్జున్ రెడ్డి’ గానీ హత్యలను ప్రోత్సహించేలా తెరకెక్కించలేదని సందీప్ రెడ్డి చెప్పాడు.

మరిన్ని వార్తలు