ఎక్కువ చేస్తున్నావ్‌..

9 Nov, 2017 17:42 IST|Sakshi

 మహిళా అధికారిపై కార్పొరేటర్‌ భర్త చిందులు  

 అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు దౌర్జన్యం  

 పరిస్థితిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నందుకు దాడి

 పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారి వాణి

సాక్షి, హైదరాబాద్‌ : అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్‌ అధికారిపై ఓ కార్పొరేటర్‌ భర్త దౌర్జన్యానికి దిగాడు. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని దుర్భాషలాడడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఇతని దౌర్జాన్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రిస్తున్న ఆమె చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కున్నాడు. అంతేకాదు.. వార్నింగ్‌ ఇచ్చి సంఘటన స్థలం నుంచి ఆమెను తరిమేశాడు. దీంతో ఆ మహిళా ఉద్యోగిని విలపిస్తూ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుధవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, బాధితురాలి కథనం ప్రకారం.. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–16లో జి.వాణి టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సెక్షన్‌ ఆఫీసర్‌. కాచిగూడ డివిజన్‌ చెప్పల్‌బజార్‌లోని 3–2–505 డోర్‌ నంబర్‌లోని 50 గజాల స్థలంలో సురేష్‌ అనే వ్యక్తి జి+3 ఇంటి నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసిన వాణి బుధవారం అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని నిర్మాణంపై ప్రశ్నించారు. అనుమతి లేకుంటే నిలిపివేయండని చెప్పారు. దీంతో సురేష్‌ విషయాన్ని కాచిగూడ కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్య భర్త ఎక్కాల కన్నకు సమాచారం అందించాడు. ఆయన భార్య కార్పొరేటర్‌ను తీసుకొని ఆఘమేఘాలపై అక్కడకు చేరుకున్నాడు.  

వస్తూ వస్తూనే..
‘నువ్వు కాచిగూడకు సెక్షన్‌ ఆఫీసర్‌గా వచ్చి నెలరోజులు కాలేదు. ఎక్కువ చేస్తున్నావ్‌.. ఏంది సంగతి? ఇక్కడి అక్రమ నిర్మాణంపై ఎవరు ఫిర్యాదు చేశారు? అంటూ ఎక్కాల కన్నా సెక్షన్‌ ఆఫీసర్‌ను నిలదీశాడు. ఫిర్యాదు కాఫీ చూపించాలంటూ చిందులు తొక్కాడు. అక్రమ నిర్మాణం జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామని ఆమె సమాధామిచ్చారు. దీంతో రెచ్చిపోయిన కార్పొరేటర్‌ భర్త ఆమెను దుర్భాషలాడాడు. అతని దౌర్జన్యాన్ని అధికారి వాణి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆమె చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొన్నాడు. దీంతో భయపడిన ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి బయటపడ్డారు. సర్కిల్‌ డీఎంసీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

విచారించి కేసు నమోదు..
సెక్షన్‌ అధికారిణి జి.వాణి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ ఆమెను సంఘటన స్థలానికి తీసుకువెళ్లి ఏం జరిగిందనే దానిపై విచారించారు. అంతేగాక వారు తీసిన వీడియోను పరిశీలించారు. సెక్షన్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు మేరకు ఎక్కాల కన్నాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వాణికి పలువురు అధికారుల మద్దతు
కాచిగూడ టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ జి.వాణిపై కార్పొరేటర్‌ భర్త దౌర్జన్యం చేసినట్లు తెలుసుకున్న వివిధ సర్కిళ్లల్లో పనిచేస్తున్న సెక్షన్‌ ఆపీసర్లు ఆమెకు బాసటగా నిలిచారు. పెద్దసంఖ్యలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వాణికి ఓదార్చి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగేవరకు తామంతా వెంట ఉంటామని భరోసానిచ్చారు.   

మరిన్ని వార్తలు