పాతబస్తీలో బందిపోటు ముఠా గుట్టు రట్టు

24 Jan, 2019 18:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో బందిపోటు ముఠా గుట్టును కాలాపత్తర్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు గురువారం సీపీ అంజనీకుమార్‌  తెలిపారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ నెల 17న కాలాపత్తర్‌లో దారి దోపిడీకి పాల్పడింది ఈ ముఠానే. మధ్యప్రదేశ్‌కు దీపంజాయ్‌ బుందేలా హైదరాబాద్‌కి వచ్చి.. చర్లపల్లి జైలులో ఉన్న తన సోదరుడిని ములాఖత్‌ ద్వారా కలిశారు. అయితే అదే రోజు దొంగల ముఠా సభ్యులు కూడా జైల్లో ఉన్న ఆఫ్రోజ్‌ ఖాన్‌ను కలిశారు.

ఆ తర్వాత బుందేలా కదలికలను పసిగట్టిన ముఠా సభ్యులు సయ్యద్‌ యూనస్‌, సయ్యద్‌ అబద్దీన్‌లు తమను అతడికి పరిచయం చేసుకున్నారు. బుందేలా మధ్యప్రదేశ్‌కు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి బయలు దేరగా.. నిందితులు తమ కారులో డ్రాప్‌ చేస్తామని నమ్మబలికారు. కారులో వెళ్తుండగా కాలాపత్తర్‌లోని జీవన్‌ లాల్‌ మిల్క్‌ వద్ద బాధితున్ని కొట్టి 18 వేల రూపాయల నగదు, గోల్డ్‌ రింగ్‌ను చోరీ చేశారు. ముఠా సభ్యులపై ఇప్పటికే పలు పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు ఉన్నాయి. వారిలో కొందరిపై పీడీ యాక్ట్‌లు కూడా ఉన్నాయ’ని తెలిపారు.

మరిన్ని వార్తలు