‘కన్నా’ కోడలు అనుమానాస్పద మృతి

29 May, 2020 06:50 IST|Sakshi
భర్తతో సుహారిక (ఫైల్‌)

విందులో డ్యాన్స్‌ చేస్తూ స్పృహతప్పి పడిపోయిన చిన్న కుమారుడి భార్య

ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు

మృతిపై అనుమానాల్లేవని కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌

ఆ సమయంలో విందుపై పోలీసుల విచారణ

హైదరాబాద్‌/రైలుపేట (గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య నల్లపు రెడ్డి సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్‌లోని విల్లా నంబర్‌–28లో అద్దెకుండే పవన్ ‌రెడ్డి ఇంట్లో విందు చేసుకుంటున్న సమయంలో డ్యాన్స్‌ చేస్తూ ఆమె స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. రాయదుర్గం సీఐ ఎస్‌.రవీందర్‌ కథనం ప్రకారం.. సుహారికకు ఫణీంద్రతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గచ్చిబౌలిలోని హిల్‌రిడ్జ్‌ విల్లా నంబర్‌ 11లో ఉంటున్నారు. సుహారిక తల్లి మల్లిసాగరిక కూడా వీరితో ఉంటున్నారు. ఫణీంద్ర, సుహారికలకు సంతానంలేదు. కాగా, సుహారిక చెల్లి నిహారిక భర్త ప్రవీణ్‌రెడ్డికి బంజారాహిల్స్‌కు చెందిన వివేక్, విహాస్, పవన్‌రెడ్డిలు స్నేహితులు. వీరంతా తరచూ పార్టీలు చేసుకుంటారు.

విందులో డ్యాన్స్‌ చేస్తూ..
కాగా, గురువారం ఉ.7.30 గంటలకు వీరంతా పవన్‌రెడ్డి ఇంట్లో పార్టీ ప్లాన్‌ చేసుకున్నారు. సుహారిక భర్త ఫణీంద్రకు వీలుపడక సుహారిక మాత్రమే పార్టీకి వెళ్లారు. అప్పటి నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు విరామం లేకుండా డ్యాన్స్‌ చేయడంతో సుహారిక స్పృహ తప్పి పడిపోయారు. అక్కడికి సమీపంలో ఏఐజీ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. అరగంట పాటు వైద్యులు చికిత్స అందించినా ఆమె స్పందించకపోవడంతో చివరికి చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే, సా.5.30 గంటల ప్రాంతంలో రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వైద్యులతో మాట్లాడారు. అంతేకాక.. విందులో పాల్గొన్న వారందరినీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమార్తె మృతిపై అనుమానం లేదని సుహారిక తల్లి మల్లిసాగరిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

డ్యాన్స్‌ చేయడంవల్లే స్పృహ తప్పి పడిపోయారని, ఆమె మరణంపై ఏ అనుమానాలు లేవని భర్త ఫణీంద్ర కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయి ఉండొచ్చని తెలిపారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే సుహారిక మృతికి అసలు కారణాలు తెలుస్తాయని సీఐ ఎస్‌.రవీందర్‌ తెలిపారు. ఆమె మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నేడు ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు పంపనున్నారు. అయితే, సుహారిక మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. అంత ఉదయం ఎందుకు పార్టీ చేసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కన్నా లక్ష్మీనారాయణ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా