టీవీ నటి ఆత్మహత్య

2 Jun, 2020 07:46 IST|Sakshi

టీవీ తార చందన విషాదాంతం

ప్రియుడు మోసగించాడని ఆత్మహత్య 

సాక్షి, కర్ణాటక: పల్లె వదిలి పట్నానికి వచ్చిందామె. సినిమాల్లో తారగా వెలుగొందాలని కలలుకంది. ఇంతలో ఓ వంచకుడు తీయని మాటలతో వలవేసి ఐదేళ్లు మోజు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగేసరికి ముఖం చాటేయడంతో ఆ అభాగ్యురాలు విషాన్ని ఆశ్రయించింది. కన్నడ టీవీ నటి చందన (29) నిజ జీవితం విషాదాంతమైంది. పురుగుల మందు తాగిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

హాసన్‌ జిల్లా బేలూరుకు చెందిన చందన సినిమాల్లో నటించాలని బెంగళూరుకు వచ్చింది. కన్నడ బుల్లితెరతో పాటు పలు ప్రకటనలు, సినిమాలో చిన్నచిన్న పాత్రల్లో ఆమె నటించింది. పురుగుల మందు తాగడాన్ని ఆమె సెల్ఫీ వీడియో తీసుకుంది. అందులో ప్రియుడు దినేశ్‌పై అనేక ఆరోపణలు చేశారు. అనేక రకాలుగా దినేశ్‌ తనకు అన్యాయం చేశాడని సెల్ఫీ వీడియోలో బోరుమంది. అరెస్టు భయంతో దినేశ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఏం జరిగిందంటే  
చందనా, దినేశ్‌లు గత ఐదేళ్లు నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని చందన కోరగా అతడు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆమె దినేశ్‌ కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావించగా అవమానించి పంపారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఆమె జీవితం మీద విరక్తితో సోమవారం నివాసంలో పురుగుల మందు తాగింది. ఆ వీడియోను ప్రియునికి వాట్సప్‌ చేసింది. వెంటనే అతడు వచ్చి ఆమెను ఒక ఆస్పత్రికి తరలించి పరారయ్యాడు.

పురుగులమందు ఎక్కువగా తాగడంతో ఆమె కొంతసేపటికే ప్రాణాలు వదిలింది. తన డబ్బును, కెరీర్‌ను అతనికి అర్పిస్తే మోసం చేశాడు, మరో అమ్మాయిని ఇలా మోసం చేయకు అని వీడియోలో తెలిపింది. సెల్ఫీ వీడియో ఆధారంగా దినేశ్‌ కుటుంబ సభ్యులపై సుద్దగుంట పాళ్య పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేసే దినేశ్‌ గతంలోనూ ఇలా అమ్మాయిలను మోసగించినట్లు ఆరోపణలున్నాయి.     

చదవండి: పగబట్టిన ప్రేమ; సాఫ్ట్‌వేర్‌ యువతికి..!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా