నటి ప్రేమాయణం.. విషం తాగిన తల్లి

9 Jan, 2020 10:32 IST|Sakshi
సహాయ దర్శకుడు అంజినప్ప (ఫైల్‌)

ప్రియుడితో వెళ్లిపోయిన వైనం

మనస్తాపంతో విషం తాగిన తల్లి, అమ్మమ్మ

చికిత్స పొందుతూ అమ్మమ్మ మృతి

కర్ణాటక, మండ్య : కొద్ది కాలంగా సహాయ దర్శకుడితో ప్రేమాయణం సాగిస్తున్న ఓ నటి ప్రియుడితో కలసి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన నటి తల్లి, అమ్మమ్మ విషం తీసుకోవడంతో అమ్మమ్మ మృతి చెందిన ఘటన బుధవారం మండ్య జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని మద్దూరు తాలూకా మెళ్లహళ్లి గ్రామానికి చెందిన నటి విజయలక్ష్మీ  తల్లితండ్రులు మహదేవస్వామి, సవితా, అమ్మమ్మ చెన్నమ్మ (65)లతో కలసి చెన్నపట్టణలో నివాసం ఉంటోంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన విజయలక్ష్మీ కొద్ది రోజులుగా తుంగభద్ర అనే చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో రాయచూరులో పది రోజుల పాటు చిత్రీకరణ జరుపుకొన్న సమయంలో చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్న అంజనప్పతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో గతనెల 15న ఆంజనప్పతో కలసి వెళ్లిపోయిన విజయలక్ష్మీ 15 రోజుల అనంతరం ఇంటికి తిరిగివచ్చింది. ఇకపై ఇటువంటి తప్పులు పునరావృతం చేయనని చెప్పగా తల్లితండ్రులు విజయలక్ష్మీని క్షమించారు.

ఇది జరిగిన కొద్ది రోజులకే ఈనెల 3న మళ్లీ అంజనప్పతో కలసి విజయలక్ష్మీ వెళ్లిపోయింది. దీంతో అంజనప్ప చిరునామా కనుక్కొన్న విజయలక్ష్మీ తండ్రి మహదేవస్వామి అంజినప్ప తల్లితండ్రులను విచారించగా అక్కడికి కూడా రాలేదని సమాధానం వచ్చింది. కూతురు వెళ్లిపోయిందని బాధలో ఉండగానే కొత్త చిత్రాలకు సంబంధించి విజయలక్ష్మీకి అడ్వాన్స్‌ ఇచ్చిన దర్శక నిర్మాతలు ప్రతిరోజూ ఇంటికి వస్తూ దుర్భాషలాడసాగారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన తల్లి సవిత, అమ్మమ్మ చెన్నమ్మ సోమవారం విషం తాగారు. అంతకుముందు తమ మరణానికి అంజినప్ప కారణమని వీడియో చిత్రీకరించారు. ఇది గమనించిన మహదేవస్వామి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చెన్నమ్మ మృతి చెందగా సవితా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా విజయలక్ష్మీ ఇప్పటివరకు సుమారు 16 చిత్రాల్లో నటించిందని తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా