పక్కా ప్లాన్‌తో పోలీసులపై కాల్పులు

3 Jul, 2020 12:00 IST|Sakshi
వికాస్‌ దూబే (ఫైల్‌)

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు చనిపోగా, అయిదుగురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశశ్రాతో పాటు ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున 1.30 గంటలకు చోటుచేసుకుంది. ఇటీవల హత్యాయత్న కేసుకు సంబంధించి రౌడీ షీటర్‌ వికాస్‌దూబేపై రాహుల్‌ తీవారీ అనే గ్రామస్థుడు ఫిర్యాదు చేయడంతో.. అతడిని పట్టుకునేందుకు డీఎస్పీ దేవేందర్‌ మిశ్రా ఆధ్వర్యంలోని 16 మంది పోలీసుల బృందం గురువారం రాత్రి బిక్రూ గ్రామానికి వెళ్లారు. పోలీసులు గ్రామానికి చేరుకోగానే అక్కడ వారి కదలికలను గుర్తించిన నేరస్థులు పోలీసులు బయటకు వెళ్లకుండా రోడ్లన్నీ దిగ్భంధించారు. పోలీసులు తమ వాహనాల నుంచి కిందకు దిగగానే నేరస్థులు తమ భవనాలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. (పోలీసులపై కాల్పులు.. 8 మంది మృతి)

నేరస్థులు ఎత్తైన ప్రదేశం నుంచి కాల్పులు జరపడంతో డీఎస్పీ సహా ఎనిమిది పోలీసులు మరణించారు. పోలీసులపై దాడి తర్వాత దూబే మనుషులంతా అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో మరో అయిదుగురు పోలీసులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డీజీపీ హెచ్‌సీ అవస్థీ తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. ఆరు జిల్లాలతో కూడిన కాన్పూర్‌ డివిజన్‌లోని అన్ని సరిహద్దులను మూసివేసినట్లు డీజీపీ తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పించారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.(‘మహా’ పెరుగుదల: ఒక్క రోజే 6330 కేసులు)

పోలీసుల వివరాల ప్రకారం... కరుడు గట్టిన రౌడీ షీటర్‌ వికాస్‌ దూబే బిక్రూ గ్రామానికి చెందిన వ్యక్తి. అతను అదే గ్రామంలో ఓ ప్రైవేటు గ్యాంగ్‌ ముఠాను నడుపుతున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌లో ఎక్కువగా యువతను చేర్చుతూ, వారికి కావాల్సిన ఆయుధాలను కూడా సమకూరుస్తాడు. అతడిపై హత్య, దొంగతనాలు, కిడ్నాప్‌లతో సహా 60 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2000 ఏడాదిలో తారాచంద్‌ ఇంటర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సిద్ధేశ్వర్‌ పాండే హత్య కేసులో దూబే పేరు కూడా ఉంది. అదే విధంగా 2001లోనూ అప్పటి మంత్రిగా పదవిలో ఉన్న బీజేపీ నేత సంతోష్‌ శుక్లాను శివలి పోలీస్‌ స్టేషన్‌లో హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దూబే ప్రధాన నిందితుడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అయితే ఈ కేసులో దూబేను సెషన్‌ కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఇక బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వికాస్‌ దూబే నగర పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు