బెంగళూరు షాక్‌.. లోకాయుక్తకు కత్తిపోట్లు

7 Mar, 2018 15:27 IST|Sakshi
కత్తిపోట్లకు గురైన జస్టిస్‌ విశ్వనాథ శెట్టి (ఫైల్‌ఫొటో), అదుపులో దాడికి పాల్పడిన వ్యక్తి తేజస్‌ శర్మ

 సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఓవ్యక్తి ఏకంగా ఆ రాష్ట్ర లోకాయుక్తను కత్తితో పలుమార్లు పొడిచేసి కలకలం సృష్టించాడు. నేరుగా బెంగళూరులోని లోకాయుక్త ఆఫీసుకు వెళ్లి అక్కడ లోకాయుక్తగా పనిచేస్తున్న జస్టిస్‌ పీ విశ్వనాథ శెట్టి(74)పై కత్తితో పలుమార్లు దాడి చేశాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. పలు కత్తిపోట్లకు గురైన లోకాయుక్త జస్టిస్‌ విశ్వనాథశెట్టిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తిని తేజస్‌ శర్మ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కర్ణాటక హోమంత్రి రామలింగ రెడ్డి ప్రకటన చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం ఓ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తన ఫిర్యాదుపై అలసత్వం ప్రదర్శించారనే ఆగ్రహంతో ఏకంగా జస్టిస్‌ శెట్టిపై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నేరుగా ఆస్పత్రికి వెళ్లి జస్టిస్‌ శెట్టిని పరామర్శించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌పార్టీ నేత బ్రిజేశ్‌ కలప్పా స్పందిస్తూ లోకాయుక్తను ఎవరైనా కలుసుకోవచ్చని అన్నారు. ఏదైనా ఒక అవినీతి అంశానికి సంబంధించి ఆధారాలుంటే వాటిని తీసుకొని సామాన్యుడు సైతం లోకాయుక్తను కలిసేందుకు అవకాశం ఉందని, కనీసం ఒక ఆయుధం కలిగిన భద్రతా సిబ్బంది కూడా అక్కడ లేరని చెప్పారు. బహుశా దాడికి పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి అయ్యుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ’పలు చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మెటల్‌ డిటెక్టర్‌ కూడా ఉంది. ఎంతోమందిని గమనిస్తునే ఉంటారు.. అలాంటిది అక్కడ భద్రతా మొత్తానికే లేదని కూడా అనలేం’ అని ఆయన మరో అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, మాజీ లోకాయుక్త సంతోష్‌ హెగ్దే దీనిపై స్పందిస్తూ కచ్చితంగా ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు