హవాలా కేసులో కర్ణాటక మంత్రి

22 Jun, 2018 04:39 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: హవాలా వ్యవహారంతో కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌కు సంబంధం ఉందని ఐటీ అధికారులు గురువారం బెంగళూరు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కోర్టు ఆయనకు నోటీసు జారీ చేసింది. మంత్రి శివకుమార్‌ లెక్కల్లో చూపని రూ.5 కోట్ల నగదును ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీకి అందజేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. 2017 జనవరి 1న ఏఐసీసీకి రూ.3 కోట్లు, అదే నెల 9న మరో రూ.2 కోట్లు కర్ణాటక కాంగ్రెస్‌ నేత ద్వారా ఏఐసీసీకి అందజేసినట్లు తెలిపింది. ఇందుకోసం తన హవాలా నెట్‌వర్క్‌ను వినియోగించుకున్నారని ఆరోపించింది. గతేడాది ఆగస్టులో శివకుమార్, అతని అనుచరుల ఇళ్లు, ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు జరిపి రూ.20 కోట్ల నగదుతోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకునే శివకుమార్‌పై ఐటీ అధికారులు తాజాగా ఫిర్యాదు చేశారు. పన్ను ఎగవేత కేసుల్లో ఇది ఆయనకు నాలుగో నోటీసు కావటం గమనార్హం.

మరిన్ని వార్తలు