పప్పులో కాలేసిన కర్ణిసేన

25 Jan, 2018 09:51 IST|Sakshi

భోపాల్‌ : రాజ్‌పుత్‌ కర్ణిసేన పప్పులో కాలేసింది. పద్మావత్‌కు నిరసనగా చేపట్టిన ఆందోళనలో అతి చూపించటంతో సొంత కార్యకర్తే నష్టపోయాడు. అంతా కలిసి అతని కారును తగలబెట్టేశారు. బుధవారం సాయంత్రం భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

జ్యోతి టాకీస్‌ వద్ద సాయంత్రం గుమిగూడిన కర్ణిసేన ఒక్కసారిగా విధ్వంసకాండకు పాల్పడ్డారు. కనిపించిన షాపులను, వాహనాలను పగలగొడుతూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ‘ఎంపీ 04 హెచ్‌సీ 9653’  స్విఫ్ట్‌ కారును వారు తగలబెట్టారు. అది గమనించిన కారు యాజమాని లబోదిమంటూ పరిగెత్తుకొచ్చాడు. 

కారు యాజమానిని ఈడబ్ల్యూఎస్‌ కాలనీలో నివసించే సురేంద్ర సింగ్‌ గా గుర్తించారు. కర్ణిసేన కార్యకర్త అయిన అతను తన కారును పక్కనే నిలిపి నిరసనకారులతో కలిసి పక్క వీధిలో ఆందోళన చేపట్టాడంట. ఇంతలో ఎవరో కారు తగలబడుతోందని సురేంద్రకు చెప్పటంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లాడంట. కానీ, అప్పటికే కారు సగంకి పైగా కాలిపోయిందని సురేందర్‌ చెబుతున్నాడు. స్టిక్కర్‌ను కూడా గమనించకుండా కర్ణిసేన కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడినట్లు అతను వాపోయాడు. పోలీసులకు అతను ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

అట్టుడుకుతున్న భోపాల్‌...
మొదటి నుంచి పద్మావత్‌ విడుదలపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బ్యాన్‌ కోసం తీవ్రంగా యత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు రాజ్‌పుత్‌ కర్ణిసేన మాత్రం పద్మావత్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఆడనివ్వబోమని ప్రకటించి భోపాల్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. 

ఎంపీ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అల్లర్లకు పాల్పడుతున్న 12 మంది కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన కీలక నేతలు స్టేషన్‌ను ముట్టడించటంతో పోలీసులు వారిని విడిచిపెట్టాల్సి వచ్చింది. నేడు చిత్రం విడుదల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు.  

మరిన్ని వార్తలు