‘లంచం వద్దంది.. అందుకే చంపా!’

4 May, 2018 12:15 IST|Sakshi
షహిల్‌ బాల శర్మతో విజయ్‌ సింగ్‌ వాగ్వాదం

సిమ్లా: నిజాయితీతో వ్యవహరించిన ఓ అధికారిణిని వెంటాడి చంపిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్రమ కట్టాల కూల్చివేతను పర్యవేక్షించిన అధికారి షహిల్‌ బాల శర్మ(51)ను ఓ వ్యక్తి అతికిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు విజయ్‌ను ఎట్టకేలకు గురువారం సాయంత్రం పోలీసులు మధురలో(యూపీ) అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు విజయ్‌ పోలీసులకు అసలేం జరిగిందో చెప్పాడు. 

‘కూల్చివేతలు వద్దని ఆమెను బతిమాలుకున్నాం. ఆమె వినలేదు. చివరకు లంచం కూడా ఇస్తామన్నాం. కానీ, ఆమె తిరస్కరించారు. నా తల్లి ఆమె కాళ్ల మీద పడింది.. అయినా కనికరించలేదు. పైగా తాను నిజాయితీ ఆఫీసర్‌నంటూ ప్రగల్భాలు పలికారు. తన చేతిలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని.. వాటిని పాటించక తప్పదని ఆమె చెప్పారు. భరించలేక పోయా.. అందుకే వెంటాడి చంపేశా’ అని విజయ్‌ తెలిపాడు. ఘటన తర్వాత అడవిలోకి పారిపోయిన నిందితుడు.. ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చి డబ్బు, ఏటీఎంలతో ఢిల్లీకి చేరుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీయించుకుని మధురకు చేరుకున్నాడని, సెల్‌ ఫోన్స్‌ సిగ్నల్‌ ఆధారంగా అతన్ని కనిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.  

కాగా, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి కసౌలీ పట్టణంలో అక్రమ కట్టడాలను కూల్చివేతకు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉపక్రమించింది. పోలీసుల సాయంతో అధికారులు నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్లను కూల్చివేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్‌ హౌజ్‌ కూల్చేందుకు యత్నించగా..  అధికారిణి షహిల్‌ బాల, ఆ గెస్ట్‌హౌజ్‌ యజమాని విజయ్‌ సింగ్ మధ్య వాగ్వాదం మొదలైంది. కోపోద్రిక్తుడైన విజయ్‌ సింగ్‌​ తుపాకీతో వెంటాడి పీడబ్ల్యూడీ అధికారులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో షహిల్‌ బాల అక్కడిక్కడే మృతి చెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు