ఫేస్‌బుక్‌లో ఉగ్ర ఎర

19 Nov, 2018 04:04 IST|Sakshi

కశ్మీర్‌లో తొలిసారి మహిళ అరెస్ట్‌

శ్రీనగర్‌: ఫేస్‌బుక్‌ ద్వారా యువకుల్ని రెచ్చగొడుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న కశ్మీరీ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె ప్రధానంగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కోసం పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆరోపణలపై కశ్మీర్‌లో ఒక మహిళను అరెస్ట్‌ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉత్తర కశ్మీర్‌లోని బందీపూర్‌కు చెందిన షాజియా(30) అనే మహిళ ఫేస్‌బుక్‌ వేదికగా జిహాద్‌ కోసం పనిచేయాలని, ఆయుధాలు చేతపట్టాలని యువకులు లక్ష్యంగా పోస్టులు పెట్టిందని పోలీసులు గుర్తించారు.

ఆ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఆమెను కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అనంత్‌నాగ్‌కు చెందిన ఇద్దరు యువకులకు ఆమె ఆయుధాలు, తుపాకీ మేగజీన్లు అందించినట్లు విచారణలో తెలిసింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షాజియా ఇన్మార్ఫర్‌గా నటిస్తూ పోలీసుల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని మిలిటెంట్లకు చేరవేసినట్లు భావిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. మిలిటెంట్లను పట్టుకోవడంలో సాయపడతానని చెప్పి ఆమెనే పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించేదని తెలిసింది. షాజియా ప్రవర్తనపై అనుమానంతో కొన్నాళ్లుగా పోలీసులు ఆమెపై నిఘా పెంచారు. షాజియా నుంచి పోలీసులు గ్రెనేడ్లు, ఇతర ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె ఇద్దరు సోదరుల్ని కూడా అరెస్ట్‌ చేశారు.

సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై దాడి..
దక్షిణ కశ్మీర్‌ పుల్వామా జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై ఆదివారం జరిగిన మిలిటెంట్ల దాడిలో ఒక హవల్దార్‌ మరణించగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సాయుధులు శిబిరంపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసిరారని అధికారులు తెలిపారు. కశ్మీర్‌లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాకపురా అనే ప్రాంతంలో ఈ క్యాంపును ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు