ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు

7 Feb, 2020 19:20 IST|Sakshi

జైపూర్‌ : ఆటోలో సీటు కోసం గొడవ పడి ఒక కశ్మీరీ యువకుడు తన ప్రాణం పోగొట్టుకొన్న విషాద ఘటన జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌కు చెందిన 18 ఏళ్ల బసిత్‌ జైపూర్‌ ప్రాంతంలో క్యాటరింగ్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బసిత్‌ ఫిబ్రవరి 5న అర్ధరాత్రి సమయంలో తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకు కోవర్కర్లతో కలిసి బయలుదేరాడు. కొద్దిసేపటికి రూంకు వచ్చిన బసిత్‌ను గాయాలతో చూసిన అతని స్నేహితులు జైపూర్‌లోని సవాయి మాన్‌ సింగ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే బసిత్‌ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆసుపత్రిలో మృతి చెందాడు.  బసిత్‌ మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ అతని స్నేహితులు జైపూర్‌లోని హర్మదా టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  పోలీసులు  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బసిత్‌ మృతి వెనుక గల కారణాలను 24గంటల్లోనే చేధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

'కశ్మీర్‌కు చెందిన బసిత్‌ జైపూర్‌లో క్యాటరింగ్‌ బాయ్‌గా పనిచేసేవాడు. ఎప్పటిలాగే ఫిబ్రవరి 5వ తేదీన తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకని సిద్ధమయ్యాడు. ఇంతలో అతనితో పాటు పనిచేసే కోవర్కర్లు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో అక్కడికి ఒక ఆటో రావడంతో బసిత్‌ ఆటో ఎక్కేందుకు ప్రయత్నించగా అతన్ని నెట్టివేసి మిగతావారు కూర్చున్నారు. ఆటోను నేను ఆపితే మీరు ఎక్కడమేంటని, పైగా నాకు సీటు ఇవ్వకుండా తోసేస్తారా అని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బసిత్‌ను తీవ్రంగా కొట్టి కింద పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. తర్వాత కాసేపటికి బసిత్‌ తన రూంకు వచ్చి తన స్నేహితులకు విషయం చెప్పి సృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆసుపత్రికి తరలించారని, కానీ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడని' స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వెల్లడించారు.ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఇద్దరు నిందితుల్లో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, అతని పేరు ఆదిత్య అని, స్వస్థలం ఢిల్లీ అని పోలీసులు తెలిపారు. కాగా మరొకరి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని  స్పష్టం చేశారు. బసిత్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అతని బంధువులకు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు