పూర్తిగా న్యాయం జరగలేదు : కథువా బాధితురాలి తల్లిందండ్రులు

11 Jun, 2019 13:27 IST|Sakshi

కశ్మీర్‌ : ఏడాదిన్నర క్రితం కథువాలో జరిగిన దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. కోర్టు తీర్పు తమకు సంతృప్తినివ్వలేదని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా భావించిన వ్యక్తినే నిర్దోషిగా విడుదల చేయడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘నా కూతుర్ని గుర్తు చేసుకోకుండా ఒక్క రోజు కూడా గడవడంలేదు. తను నాకు పదే పదే గుర్తుకొస్తుంటుంది. నా కళ్ల ముందే ఉన్నట్లు అన్పిస్తుంది. సోమవారం తీర్పు వస్తుందని నాకు చెప్పారు. కానీ కోర్టుకు వెళ్లి కూర్చోవాలనిపించలేదు. పదే పదే జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకోవాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు. అందుకే కోర్టుకు వెళ్లలేదు. అయితే తీర్పు గురించి విన్నప్పుడు నాకు సంతోషం కలగలేదు. ఏడగురు నిందితులకు మరణ శిక్ష పడాలని భావించాను. కానీ తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది. సంపూర్ణ న్యాయం జరిగినట్లు అనిపించడం లేద’న్నారు.

బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నా చిట్టితల్లి సమాధి దగ్గరికి వెళ్లాను. దుఃఖం ఆగలేదు. నేటికి కూడా తనను తల్చుకోని ఏడుస్తూనే ఉన్నాను. నా శోకం ఇప్పట్లో తీరదు. కనీసం తీర్పు అయినా మేం కోరుకున్న విధంగా వస్తే సంతోషించే వాళ్లం. కానీ అలా జరగలేదు. నిందితులందరిని ఉరి తీస్తేనే నా చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూరుతుంది. న్యాయం జరుగుతుంద’న్నారు.

నిరుడు జనవరిలో జమ్మూలోని కథువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రాం, మరో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మరో ముగ్గురికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 50,000 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సాంజీరాం కుమారుడు విశాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, ఆయనకు సమీప బంధువైన మైనర్‌ బాలుడు జువెనైల్‌ కోర్టులో విచారణనెదుర్కొంటున్నాడు. ఆ దురంతం సాధారణమైనది కాదు. అసిఫాను దారుణంగా హింసించి మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపారు. చివరికామెను రాళ్లతో కొట్టి చంపారు.

మరిన్ని వార్తలు