‘కథువా’ కేసు; కోర్టు విచారణ ప్రారంభం

16 Apr, 2018 11:09 IST|Sakshi

సుప్రీం జోక్యంతో తొలగిన అడ్డంకులు.. ఏప్రిల్‌ 28కి తదుపరి వాయిదా

అడ్వొకేట్‌ దీపికకు మళ్లీ బెదిరింపులు

న్యాయం కావాలంటూ దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలు

జమ్ము: ‘ఆ పసిమొగ్గను చిదిమేసిన కీచకులను కఠినంగా శిక్షించాలం’టూ నినాదాలు మిన్నంటుతున్నవేళ కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, హత్య కేసుపై సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఏడుగురు నిందితులపై మోపిన అభియోగాలను పరిశీలించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేశారు. ఎనిమిదో నిందితుడు.. బాలికపై అకృత్యంలో ప్రధాన పాత్రధారి అయిన బాలనేరస్తుడిపై విచారణను విడిగా చేపట్టనున్నారు. ఇక ఇదే కేసుకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు ముందుకురానున్నాయి.

నిందితులు వివరాలివే: బాలికపై కీచకపర్వం కేసును దర్యాప్తు చేసిన జమ్ముకశ్మీర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు.. మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. బక్వారా ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా కుట్రలు చేసి, పాపపై అకృత్యం జరగడానికి అసలు సూత్రధారి, రిటైర్డ్‌ ఉద్యోగి సాంజీ రామ్‌ను ఏ1గా పేర్కొన్నారు. చిన్నారిని అపహరించి, తొలుత అత్యాచారం చేసిన సాంజీరామ్‌ మేనల్లుడు మైనర్‌(15 ఏళ్లు) కావడంతో అతనిని విడిగా విచారించనున్నారు. నాలుగు రోజుల నరకం తర్వాత బాలికను కర్రతో కొట్టి చంపిందికూడా ఈ బాలనేరస్తుడే కావడం గమనార్హం. ఇక మైనర్‌ నేరస్తుడి స్నేహితుడు పర్వేశ్‌ కుమార్‌, సాంజీరామ్‌ కొడుకు విశాల్‌, మీరట్‌ స్పెషల్‌ పోలీసులు దీపక్‌ ఖజూరియా, సురేంద్ర వర్మలు కూడా బాలికపై అత్యాచారం జరిపారన్న ఆధారాలు లభించడంతో వారినీ ప్రధాన నిందితులజాబితాలో చేర్చారు.

లంచం తిన్న ఆ ఇద్దరు పోలీసులు కూడా: కథువా బాలికపై అకృత్యం జరిగింది జనవరిలోనే అయినా ఆ కేసును బయటికి రానీయకుండా తొక్కిపెట్టడంలో పోలీసులదే కీలక పాత్ర. బాలిక హత్యకు గురైన తర్వాత కేసు నమోదు కాకుండా ఉండేందుకు సాంజీరామ్‌.. ఎస్సై ఆనంద్‌ దత్తా, హెడ్‌కానిస్టేబుల్‌ తిలక్‌ రాజ్‌లకు రూ.4 లక్షలు లంచం ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న పోలీసులు.. కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణలో తేటతెల్లం అయ్యాయి. దీంతో ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ ఇద్దరిని కూడా నిదితుల జాబితాలో చేర్చారు.

అడ్వొకేట్‌ దీపికకు మళ్లీ బెదిరింపులు: హిందూ-ముస్లిం విబేధాల పొడచూసిన నేపథ్యంలో కథువా బాలిక హత్యాచారం కేసు విచారణ కోసం జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ఇద్దరు సిక్కు మతస్తులైన లాయర్లను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. కాగా, బాధితురాలి కుటుంబ తరఫున వాదిస్తానని అడ్వొకేట్‌ దీపికా సింగ్‌ రజావత్‌ ఇదివరకే ముందుకొచ్చారు. సోమవారం నాటి విచారణలో ఆమె వాదనే కీలకం కానుంది. దీపికా ఈ కేసును అంగీకరించింది మొదలు ఆమెకు పెద్ద ఎత్తున బెదింపులు వస్తుండం తెలిసిందే. ఆదివారం కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్‌ చేశారని, ఈ కేసు వాదిస్తే రేప్‌చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు. ‘బహుశా ఈ విచారణ పూర్తయ్యేలోపు నేను ప్రాణాలు కోల్పోవచ్చు లేదా మరొకటి జరగొచ్చు. అయితే బెదిరింపులకు భయపడి విచారణనుంచి మాత్రం తప్పుకోబోను. నాకు, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆశ్రయిస్తా’ అని దీపిక తెలిపారు.

మరిన్ని వార్తలు