సంక్లిష్టంగా కథువా కేసు!

19 Apr, 2018 09:00 IST|Sakshi

శ్రీనగర్‌ : కథువా హత్యాచార కేసులో దర్యాప్తు చాలా కష్టతరంగా మారిందని డీఎస్‌పీ శ్వేతాంబరి శర్మ ప్రకటించారు. ఆధారాలను సేకరించటం చాలా కష్టతరంగా ఉందన్న ఆమె.. ఈ కేసు చాలా సంక్లిష్టంగా మారిందని తెలిపారు. బుధవారం సాయంత్రం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె కేసు పురోగతి విషయాలను వెల్లడించారు.  (మోదీకి షాకిచ్చారు)

‘మైనర్‌ బాలిక హత్యాచార కేసులో ప్రత్యక్ష సాక్ష్యులు లేకపోవటంతో కేసులో దర్యాప్తు చాలా సంక్లిష్టంగా మారింది. నిందితులను విచారణ చేపట్టినా.. ఆధారాలను సేకరించటంలో చాలా కష్టాలు ఎదుర్కుంటున్నాం. ఈ ఘటన అత్యంత పాశవికమైందని ప్రతీ ఒక్కరికీ తెలుసు. కానీ, కావాల్సింది ఆధారాలు. ప్రకటనలు చేసినంత సులువు కాదు కేసు దర్యాప్తు చేయటం’ అని ఆమె వ్యాఖ్యానించారు.  బాధితుల తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్‌ దీపికా సింగ్‌ రజావత్‌ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.

డిఫెన్స్‌ లాయర్‌ ఆరోపణలపై... 
ఇక ఈ కేసులో డిఫెన్స్‌ లాయర్‌ అంకుర్‌ శర్మ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘ ఒక మహిళను ఇలా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం సరికాదు. అలాంటి వ్యాఖ్యలపై నేను స్పందించను. దేశ ప్రజలే బదులిస్తారు’ అంటూ శ్వేతాంబరి వెల్లడించారు. ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యానికి తాను చలించిపోయానన్న ఆమె.. తర్వాత కోలుకుని దర్యాప్తును వేగవంతం చేశానని ఆమె తెలిపారు. ‘మన న్యాయ వ్యవస్థ చాలా శక్తివంతమైంది. దానిపై అనుమానాలు అక్కర్లేదు’ అని ఆమె అన్నారు. 

కథువా కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న అంకుర్‌ శర్మ తాజాగా సిట్‌ పర్యవేక్షకురాలు డీఎస్‌పీ శ్వేతాంబరి శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మేధాశక్తిపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. బృందంలో ఉన్న మిగతా సభ్యుల ప్రభావంతోనే ఆమె దర్యాప్తు చేస్తున్నారంటూ అంకుర్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు