విరాళాలుగా వచ్చిన సొమ్మును కాజేసిన వైనం

12 Apr, 2019 16:44 IST|Sakshi

కశ్మీర్‌ : డిజిటల్‌ బ్యాంకింగ్‌ వంటి నూతన పోకడల వల్ల నిరక్షరాస్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ వార్త మన కళ్లకు కడుతుంది. గతేడాది జనవరిలో కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఆలయంలో బంధించి సామూహిక అత్యాచారం జరిపి హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కన్న బిడ్డను పోగొట్టుకున్న బాధ నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోనేలేదు. అప్పుడే వారికి మరోక షాక్‌ తగిలింది. బిడ్డ మరణంతో కుమిలి పోతున్న వారిని ఆదుకోవాడానికి విరాళాలు ఇచ్చారు కొందరు మానవతా వాదులు. కానీ జనాలు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారంటే.. అలా వచ్చిన సొమ్మును కూడా కాజేశారు. అది కూడా దర్జాగా బ్యాంక్‌ ఖాతా నుంచి కొట్టేశారు.

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది లక్షల రూపాయలను బ్యాంక్‌ ఖాతా నుంచి ఖాతాదారునికి తెలియకుండా డ్రా చేశారు. వివరాలు.. కథువా సంఘటన తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణ ప్రారంభించాయి. అలా వచ్చిన సొమ్మును బాధితురాలి తండ్రితో పాటు వారి కుటుంబానికి చెందిన అస్లాం ఖాన్‌ అనే వ్యక్తి పేరు మీద తీసిన జాయింట్‌ అకౌంట్లో వేశారు. ప్రస్తుతం ఈ అకౌంట్‌ నుంచి తనకు తెలియకుండా ఎవరో ఏకంగా 10 లక్షల రూపాయలను విత్‌డ్రా చేశారని బాధితురాలి తండ్రి వాపోతున్నాడు. తనకు చదువు రాదని.. ఈ మోసం ఎలా జరిగిందో తనకు తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.అంతేకాక ఈ విషయం గురించి అస్లాం ఖాన్‌ను ప్రశ్నించినప్పుడు అతడు సరిగా స్పందించలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. తనకు అతని మీద అనుమానం ఉందని పేర్కొన్నాడు.

గత నెల జనవరి నుంచి నేటి వరకు తన అకౌంట్‌ నుంచి రూ. 22 లక్షలు డ్రా చేశారని తెలిపాడు. వాటిలో ఓ పది లక్షల రూపాయలు మాత్రమే తాను తీసుకున్నానని.. మిగతా మొత్తం గురించి తనకు తెలీదని వాపోతున్నాడు. ఈ విషయం గురించి బ్యాంక్‌ అధికారులను ప్రశ్నించగా.. చెక్కులు తీసుకొచ్చి సొమ్ము డ్రా చేశారని.. వాటిలో అన్ని వివరాలు సరిగా ఉండటంతో సొమ్ము​ ఇచ్చామన్నారు. కొన్ని ట్రాన్సాక్షన్లు అస్లాం ఖాన్‌ పేరు మీద జరగ్గా.. మరి కొన్ని ట్రాన్సాక్షన్లు నజీమ్‌ అనే వ్యక్తి పేరు మీద జరిగినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. బ్యాంక్‌ ఖాతా వివరాలు పూర్తిగా తెలిసిన వారే ఈ పని చేసుంటారని  అధికారలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు