ఆంక్షలు తొలిగేనా?

28 Sep, 2017 13:07 IST|Sakshi

కవ్వాల్‌ అభయారణ్యం నుంచి వాహనాల రాకపోకలపై పదేళ్లుగా నిషేధాజ్ఞలు అమలు  

పునరుద్ధరణ కోసం నలుగురు సభ్యులతో కమిటీ

ఏడు నెలలు కావస్తున్నా కనిపించని పురోగతి

సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఎదురుచూపు

ఆదిలాబాద్‌  , ఉట్నూర్‌(ఖానాపూర్‌) : కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం గుండా భారీ వాహనాల రాకపోకల పునరుద్ధరణపై ప్రభుత్వం వేసిన కమిటీ ఏడు నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన నిర్వహించిన వన్యప్రాణుల మండలి సమీక్షలో ఎమ్మెల్యేలు రాథోడ్, గువ్వల బాల్‌రాజ్, అటవీశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో కవ్వాల్‌ టైగ ర్‌ జోన్‌ అటవీప్రాంతంగుండా భారీ వాహనాల రాకపోకల పునరుద్ధరణపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సూచించారు. అయితే ఏడు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు కానరాకపోవడంతో వాహనాల రాకపోకల ఆంక్షలపై అయోమయం నెలకొంది.  

వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు..
1965 సంవత్సరంలో కవ్వాల్‌ అభయారణ్యం ప్రారంభం కాగా వన్యప్రాణి చట్టం కింద 1999లో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2012లో 42వ పులుల సంరక్షణ (టైగర్‌జోన్‌)కేంద్రంగా ఏర్పాటు చేసింది. దీని పరిధిలోకి 892.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంను కోర్‌ ఏరియాగా, 1123.212 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంను బఫర్‌ ఏరియాగా ప్రకటించింది. కవ్వాల్‌ అభయారణ్యం మధ్యలో నుంచి ఆదిలాబాద్, నిర్మల్‌ పట్టణ ప్రాంతాల నుంచి వేర్వేరుగా మంచిర్యాల వరకు ప్రధాన రహదారి ఉండటంతో గతంలో వాహనాల రాకపోకలు రాత్రీపగలు సాగేవి. అయితే వాహనాల రాకపోకలతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన అధికారులు రాకపోకలపై ఆంక్షలు విదించాలని నిర్ణయించారు. ఈ మేరకు 30 జూన్‌ 2007లో జారీ చేసిన జీవో నం.3221/2(2)07 ప్రకారం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించారు.

ఇందుకోసం అభయారణ్యంలో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కడం మండలం పాండ్వాపూర్‌ వద్ద ఒకటి, ఉట్నూరు మండలం కొత్తగూడం వద్ద మరొకటి, జన్నారం మండలం తాళ్లపేట (ప్రస్తుతం ఈ చెక్‌ పోస్టును తపాళాపూర్‌లో ఏర్పాటు చేశారు) వద్ద మూడో వన్యప్రాణి (వైల్డ్‌ లైఫ్‌) విభాగం చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ బస్సులు, అంబులెన్స్‌లు, పాలు వంటి అత్యవసర వాహనాలు మినహా మిగతావి రాత్రి వేళలో నిలిపివేయాలని అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌నదీం ఆదేశాలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో జీవో నం. 34357/2007 ప్రకారం 27 జూలై 2013 నుంచి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల పట్టణ ప్రాంతాల మధ్య భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ నిర్ణ యంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ రహదారిని ఆనుకుని దుకాణాలు నిర్వహించేవారు సర్కారు దృష్టికి తీసుకెళ్లారు.   

ఏడు నెలలు గడుస్తున్నా..
భారీ వాహనాల నిషేధం అమలుపై రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఆ శాఖ అధికారులతో వన్యప్రాణుల మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో అటవీప్రాంతం నుంచి భారీ వాహనాల రాకపోకల పునరుద్ధరణపై చర్చించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదిక అధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అప్పట్లో ప్రకటించారు. అయితే ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో ప్రధాన రహదారి వెంట వ్యాపారాలు నిర్వహించుకునే వారు నివేదక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తే తమ వ్యాపారాలు మెరుగై ఉపాధి లభిస్తుందని వారు అంటున్నారు.  

వారంలో నివేదిక వచ్చే అవకాశం
కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం రహదారి గుండా భారీ వాహనాల పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక అందించేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. ఆ నివేదిక వారం, పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. – ప్రభాకర్, డీఎఫ్‌వో, మంచిర్యాల జిల్లా

మరిన్ని వార్తలు