నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కొట్టేయాలి

9 Mar, 2018 11:21 IST|Sakshi

హైకోర్టును ఆశ్రయించినకేఈ తనయుడు

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా డోన్‌ మొదటి తరగతి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.  నారాయణరెడ్డి భార్య కె.శ్రీదేవి దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన డోన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు శ్యాంబాబుకు ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. ఇదే కేసులో డోన్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఎస్సై నాగతులసీప్రసాద్‌ హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొందారని, వారెంట్‌పై స్టే మంజూరు చేయాలని కేఈ శ్యాంబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి కోరారు. గురువారం కేసు విచారణ ప్రారంభం కాగానే శ్రీదేవి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లేచి.. శ్యాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌లో డోన్‌ కోర్టు జరిపే విచారణను కొట్టేయాలని కోరలేదని, ఈ వ్యాజ్యం చెల్లదన్నారు. వ్యాజ్యాన్ని టైపింగ్‌ చేసే దశలో సాంకేతికంగా జరిగిన పొరపాటు వల్ల అలా జరిగిందని వీరారెడ్డి బదులిచ్చారు.

సవరణలతో వ్యాజ్యాన్ని తిరిగి దాఖలు చేస్తామని కోరారు. అయినా హైకోర్టు నోటీసులు జారీ చేయకుండానే ప్రతివాది అయిన శ్రీదేవి కౌంటర్‌ పిటిషన్‌ ఏవిధంగా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. పిటిషనర్‌ కేఈ శ్యాంబాబును ఏనాడైనా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశముందని, స్టే మంజూరు చేయాలన్నారు. వాదనల అనంతరం పిటిషన్‌ను సరవరించి దాఖలు చేసేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అనుమతించారు. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. కర్నూలు జిల్లా చెరుకులపాడు గ్రామానికి చెందిన  నారాయణరెడ్డి హత్యకేసులో శ్యాంబాబు, జెడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మలను నిందితులుగా చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం చార్జిషీటులో వారి పేర్లను తొలగించారు. దాంతో లక్ష్మీనారాయణరెడ్డి భార్య శ్రీదేవి డోన్‌ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దీనిని విచారించిన డోన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు శ్యాంబాబుకు ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది.   

మరిన్ని వార్తలు