ప్రాణం తీసిన రేసింగ్‌ సరదా

20 Apr, 2018 09:27 IST|Sakshi
మృతుడు మిధున్‌ కోశ్‌ (పాత చిత్రం)

పాలక్కాడ్‌, కేరళ : బైక్‌ రైడింగ్‌ సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది. రేసింగ్‌లో భాగంగా బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో  అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన మిధున్‌ కోశ్‌(22) నెహ్రూ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. బైక్‌ రైడింగ్‌ అంటే అతడికి ఇష్టం. బైక్‌ రేసింగ్‌లలో పాల్గొనడం అలవాటు. ఇప్పటికే పలు రేసింగ్‌లో పాల్గొన్న మిధున్‌ అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తుండేవాడు. అదే కోవలో అమెరికాకు చెందిన ‘ఐరన్‌ బట్‌ అసోసియేషన్‌’  నిర్వహించిన రేసింగ్‌లో అతను పాల్గొన్నాడు. ఈ పోటీలో భాగంగా బైక్‌పై 24 గంటల్లో 1600 కిలో మీటర్లు ప్రయాణించాలి. అందుకోసం మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరిన మిధున్‌ కర్ణాటకకు చేరుకోగానే జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

పాలక్కాడ్‌ నుంచి బయల్దేరిన తన కుమారుడు తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకోని లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పాడని అతడి తల్లి పేర్కొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని బ్యాగులో ట్రిప్‌కు సంబంధించిన మ్యాప్‌ లభించిందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు