డబ్బు కోసం కుటుంబ సభ్యులనే హతమార్చిన కిలేడి..

6 Oct, 2019 10:44 IST|Sakshi

తిరువనంతపురం : కోజికోడ్‌లో 2002 నుంచి 2016 వరకూ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల హత్య కేసు మిస్టరీని కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఈ ఆరుగురు వ్యక్తుల హత్యోందంతం వెనుక సాగిన కుట్రను పోలీసులు బహిర్గతం చేశారు. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఒకరి తర్వాత ఒకరిని 14 ఏళ్ల వ్యవధిలో అంతమొందించిన కోడలు జోలీ, ఆమె రెండో భర్త షాజుతో పాటు మరొకరిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పకడ్బందీ వ్యూహంతో నిందితురాలు ఈ హత్యలను చాకచక్యంగా డీల్‌ చేశారని, ఇది తమకు సవాల్‌తో కూడిన కేసని పోలీసు అధికారి పేర్కొన్నారు. కోడలి కిరాతకానికి పొన్నమట్టం కుటుంబం బలైన తీరును పోలీసులు కళ్లకు కట్టారు.

2002లో రిటైర్డ్‌ టీచర్‌, జోలీ అత్త అన్మమ్మ థామస్‌ కుప్పకూలినప్పుడు ఇది సహజ మరణంగా కుటుంబం భావించింది. ఆరేళ్ల తర్వాత అదే ఇంట అత్త భర్త టామ్‌ థామస్‌ (66) హార్ట్‌ ఫెయిలై మరణించారు. 2011లో వారి కుమారుడు, జోలీ భర్త రాయ్‌ థామస్‌(40) ఇదే తరహాలో కన్నుమూశారు. అయితే అటాప్సీ రిపోర్ట్‌లో ఆయన మరణానికి ముందు విషప్రయోగం జరిగిందని వెల్లడైంది. ఇక 2014లో అన్మమ్మ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్‌ (67) కూడా ఇలాగే మరణించడం అనుమానాలకు తావించింది. ఇక 2016లో వారి బంధువుల కుమార్తె రెండేళ్ల అల్ఫాన్సా గుండె పోటుతో మరణించగా నెలల వ్యవధిలోనే ఆమె తల్లి సిల్లీ (27) మరణించింది.

కాగా ఈ హత్యల వెనుక వారి కుటుంబ కోడలు, రాయ్‌ భార్య జోలీ హస్తం ఉండటం కేరళలో కలకలం రేపింది. సిల్లీ భర్త షాజును పెళ్లాడిన జోలీ కుటుంబ ఆస్తిని తమ పేరున రాయాలని మామ టామ్‌పై ఒత్తిడి పెంచి ఆస్తిని బదలాయించుకుంది. అమెరికాలో స్థిరపడిన టామ్‌ చిన్న కుమారుడు మోజో ఆస్తి బదలాయింపును సవాల్‌ చేస్తూ వరుస మరణాలపై క్రైమ్‌ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. సైనేడ్‌ను ఉపయోగించి తన రెండో భర్తతో కలిసి జోలీ ఈ ఘాతుకానికి తెగబడిందని పోలీసులు నిగ్గుతేల్చారు.

>
మరిన్ని వార్తలు