'నన్ను, నాచెల్లిని చంపేస్తామంటున్నారు..'

25 Feb, 2018 17:46 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : రుతుస్రావం అనే అంశంపై ఓ పద్యాన్ని రాసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు కొందరు వ్యక్తులు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారంటూ కేరళకు చెందిన ఓ న్యాయశాస్త్ర విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను, తనతోపాటు తన సోదరిని కూడా కొంతమంతి దుండగులు విడిచిపెట్టడం లేదని, తమను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని పతానంతిట్ట అనే జిల్లాకు చెందిన మల్లపల్లీ అనే గ్రామానికి చెందిన నవామి రామచంద్రన్‌ (18) అనే యువతి నెలసరి గురించి పద్యం రూపంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అయితే, కొంతమంది సోషల్‌ మీడియా ద్వారా ఆమెను బెదిరించడమే కాకుండా స్కూల్‌కు వెళుతున్న తన సోదరి వెంట పడి తరుముతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఓ అమ్మాయి ఇప్పటికే ఇలాంటి అంశాలనే సోషల్‌ మీడియాలో పంచుకోగా ఆమెపై కొంతమంది దాడికి ప్రయత్నించడంతో ఆమెకు అండగా నవామి అదే అంశాన్ని సోషల్‌ మీడియాలో పెట్టారు. అయితే, నవామిపై కూడా తన స్నేహితురాలిపై లాంటి దాడి మాదిరిగానే మరోదాడిని ప్రారంభించారు. 'గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఇది కచ్చితంగా ఆరెస్సెస్‌ వారిపనే అయింటుంది' అని నవామి ఆరోపించింది. కాగా, తమ మనోభావాలు దెబ్బతీయొద్దంటూ నవామిపై ఆ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నవామి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి.

మరిన్ని వార్తలు