కేరళ లవ్‌ జిహాదీ కేసు.. ‘సుప్రీం’ సంచలన వ్యాఖ్యలు

23 Jan, 2018 13:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేరళ లవ్‌ జిహాద్‌ కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హదియా ఎవరితో జీవించాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మంగళవారం ఈ కేసు విచారణను కొనసాగించిన ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. 

‘‘మీరు(ఎన్‌ఐఏను ఉద్దేశించి) ఏమైనా దర్యాప్తు చేసుకోవచ్చు. కానీ, హదియా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకునే న్యాయ బద్ధత మాత్రం లేదు. మేజర్‌ అయిన ఓ అమ్మాయిని తల్లిదండ్రులతో ఉండాలని చెప్పటానికి ఎవరికీ హక్కులు లేవు. ఎవరితో జీవించాలన్న నిర్ణయం కూడా పూర్తిగా ఆమెకు మాత్రమే ఉంటుంది. పైగా వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు న్యాయస్థానాలకు కూడా ఉండదు’’ అని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు కోర్టు వాయిదా వేసింది. 

కాగా, కేరళకు చెందిన అఖిల ఆశోకన్‌(25) అనే యువతి గతేడాది డిసెంబర్‌లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్‌ జహాన్‌ను  వివాహం చేసుకుంది. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇక హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేయటంతో ఆమె భర్త షఫీన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కేసు విచారణ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు