నా తండ్రే హింసిస్తున్నాడు.. లవ్‌ జిహాద్‌ కేసులో యువతి

27 Oct, 2017 08:45 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : లవ్‌ జిహాదీ కేసుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ యువ జంట వ్యవహారం మరో మలుపు తిరిగింది. కెమెరా ముందుకు వచ్చిన అఖిల అలియా హదియా తన గోడును వెల్లబోసుకుంది. తండ్రి నుంచి తనుకు ముప్పు పొంచి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

‘‘ నా తండ్రే నన్ను క్రూరంగా హింసిస్తున్నాడు. నన్ను చంపేసేలా ఉన్నారు. దయచేసి ఇక్కడి నుంచి నన్ను విడిపించండి’’ అని అఖిల వీడియోలో ప్రాధేయపడింది. దీంతో ఆమెను బలవంతంగా ఇంట్లో దిగ్భందించారా? అన్న చర్చ మొదలైంది. హిందుత్వవాది, ఉద్యమకారుడు రాహుల్‌ ఈశ్వర్‌ ఆగష్టులో అఖిల కుటుంబ సభ్యులను కలిసిన సమయంలో ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గతంలో అఖిల తల్లి పొన్నమ్మ వీడియోను విడుదల చేసిన ఆయన.. ఈసారి ఏకంగా బాధిత యువతి వీడియోనే విడుదల చేయటం విశేషం.

ఇక ఈ ఆరోపణలను ఆమె తండ్రి అశోకన్‌ కేఎం ఖండించారు. షఫిన్‌ జహాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, అందుకే తన కూతురిని లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి చేయించాడని ఆయన అన్నారు. రాహుల్‌ ఈశ్వర్‌ చేస్తున్న ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని అశోకన్‌ స్పష్టం చేశారు. అయితే.. మత ఘర్షణలు తలెత్తె అవకాశం ఉన్నందున పూర్తి వీడియోను విడుదల చేయట్లేదని రాహుల్‌ చెబుతున్నారు. జస్టిస్‌​ రవీంద్రన్‌కు వీడియోను మెయిల్‌ చేశానన్న ఆయన  మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అయినప్పటికీ ఇంతవరకు ఎవరూ యువతి కలిసే యత్నంగానీ, ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయటం లాంటివి చేయకపోవటం గమనార్హం. 

కేరళకు చెందిన 24 ఏళ్ల అఖిల అశోకన్ అనే యువతిని  ఇస్లాం మతంలోకి మార్చి.. షఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడు పెళ్లి చేసుకోవడాన్ని ‘లవ్‌ జిహాద్‌’గా భావించిన హైకోర్టు.. వివాహాన్ని రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహిళ భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పెద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చిన పలు సందర్భాలు ఉన్నాయన్న ప్రాసిక్యూటర్‌ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది. అదే సమయంలో ఇద్దరు మేజర్ల వివాహాన్ని రద్దు చేసే అధికారం న్యాయస్థానికి ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే ఆమెను తండ్రి నియంత్రించే హక్కు లేదంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు