మహిళల్ని లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తి అరెస్ట్‌

1 Jun, 2019 18:48 IST|Sakshi

తిరువనంతపురం : గృహిణిలను టార్గెట్‌ చేసి.. మార్ఫ్‌డ్‌ ఫోటోలతో బెదిరించి.. లైంగిక వేధింపులకు గురి చేసిన ఓ యువకుడిని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. ప్రదీశ్‌ కుమార్‌(25)  ఇంటి పట్టున ఉండే వివాహిత మహిళల్ని టార్గెట్‌ చేస్తాడు‌. నెమ్మదిగా వారితో పరిచయం పెంచుకుంటాడు. వారి కుటుంబంలో ఏవైనా ఇబ్బదులు ఉన్నాయేమో తెలుసుకుంటాడు. సాయం చేస్తానని నమ్మబలికి వారి భర్తల ఫోన్‌ నెంబర్లు సంపాదిస్తాడు. తర్వాత అమ్మాయి ఫోటోతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి.. సదరు మహిళల భర్తలకు వల వేస్తాడు. వారితో చాట్‌ చేసి.. వాటి స్క్రీన్‌ షాట్స్‌ను వారి భార్యలకు పంపిస్తాడు. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని నమ్మిస్తాడు. ఈ ప్లాన్‌ వర్క్‌వుట్‌ అయ్యి సదరు మహిళలు భర్తను దూరంగా పెట్టాక.. ఓదార్పు పేరుతో ఆ గృహిణిలకు దగ్గరవుతాడు.

వారిని వీడియో చాట్‌కు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత సదరు మహిళల మార్ఫ్‌డ్‌ ఫోటోలు చూపించి వారిని బెదిరించడం ప్రారంభిస్తాడు. మాట వినకపోతే ఈ ఫోటోలను వారి భర్తలకు చూపిస్తానని బెదిరించి వారిని లొంగదీసుకుంటారు. ఇలా ఏకంగా 50 మంది మహిళల్ని నమ్మించి, మోసం చేసి, బెదిరించి దారుణాలకు పాల్పడ్డాడు. చివరకు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు యువకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి.. అతని నుంచి మహిళల మార్ఫ్‌డ్‌ ఫోటోలను, ల్యాప్‌టాప్‌ని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు