కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం

2 Feb, 2018 10:18 IST|Sakshi

రహస్యంగా ఉంచిన కేజీబీవీ వర్గాలు

నేరుగా విజయనగరం తీసుకెళ్లిన తల్లిదండ్రులు  

విజయనగరం, బొబ్బిలి: పండగ సెలవులకని ఇంటికి వెళ్లిన విద్యార్థినికి పండగ పూర్తయ్యే సరికి మరింత బెంగ పట్టుకుంది. తల్లిదండ్రులు కూడా బలవంతం మీద స్కూలుకు పంపిస్తే అక్కడ ఉండలేక ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టింది. తోటి విద్యార్థులు, కస్తూర్బా స్పెషలాఫీసరు తెలిపిన వివరాల ప్రకారం...బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన  రామవరపు భారతి(15) బొబ్బిలిలోని  కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. భారతి గత నెల 11న పండగ సెలవులకని ఇంటికి వెళ్లింది. పాఠశాల పునఃప్రారంభమైనా తిరిగి పాఠశాలకు రాలేదు. ఈ విషయమై కస్తూర్బా గాంధీ విద్యాలయం స్పెషలాఫీసరు ఛాయాదేవి పలుమార్లు ఫోను చేసినా ఒత్తిడి భయంతో తల్లిదండ్రుల చేత చెప్పించి కొన్ని రోజులు రాలేదు. 

బుధవారం ఎస్‌ఎస్‌ఏ పీఓ సమావేశం ఉందని ప్రతీ ఒక్కరూ హాజరులోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో గైర్హాజరుంటే ఊరుకునేది లేదని స్పెషలాఫీసరు ఛాయాదేవికి చెప్పడంతో కేజీబీవీ స్పెషలాఫీసరు తల్లిదండ్రులకు గట్టిగా చెప్పారు. దీంతో తల్లిదండ్రులు భారతిని స్కూల్‌కి వెళ్లాల్సిందేనని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్ధిని పాఠశాలకు చేరుకుంది. సమావేశ అనంతరం ఫలితాలపై రాజీ లేదని ఎస్‌ఎస్‌ఏ పీఓ విద్యార్థులందరికీ గట్టిగా చెప్పారు. తరువాత ఏం జరిగిందో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యార్థిని పాఠశాల భవనం నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాల పాలైన భారతి విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారమందించారు.  తల్లిదండ్రులు వచ్చి భారతిని నేరుగా విజయనగరం ఆసుపత్రికి  తీసుకెళ్లారు. మధ్యాహ్నం జరిగిన సంఘటనను రహస్యంగా ఉంచేందుకు యత్నించినా చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎస్‌ఓ ఛాయాదేవి మాట్లాడుతూ విద్యార్థినికి చదవడం ఇష్టం లేదని ఇంటి నుంచి రావడానికి మొరాయించిందని చెప్పారు. ఏమైనా ప్రమాదం నుంచి బయటపడిందని పేర్కొన్నారు. అమ్మాయికి చదవడం ఇష్టం లేకే ఇలా చేసిందని అనుకుంటున్నట్టు ఎస్‌ఎస్‌ఏ పీఓ లక్ష్మణరావు చెప్పారు. 

మరిన్ని వార్తలు