‘నిలోఫర్‌’ నుంచి శిశువు అపహరణ

23 Oct, 2017 02:25 IST|Sakshi
శిశువును నిలోఫర్‌కు తీసుకువస్తున్న కల్పన, ఆయాగా పరిచయమైన గుర్తుతెలియని మహిళ(సీసీ కెమెరాలో రికారై్డన దృశ్యం)

ఆయాగా పరిచయమై.. కళ్లుగప్పి తీసుకెళ్లిన మహిళ 

హైదరాబాద్‌: కన్నబిడ్డను ఆ తల్లి కడుపారా చూసుకోక ముందే అపహరించారు. ఆయాగా వచ్చిన మహిళ.. శిశువు అమ్మమ్మ కళ్లు గప్పి ఈ దారుణానికి పాల్పడింది. ఆదివారం హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన పాండూ భార్య నిర్మల శుక్రవారం పాతబస్తీలోని పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. అదే రోజు ఆసుపత్రిలో నిర్మల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు నిమోనియా ఉండటంతో శిశువును నిలోఫర్‌కు తీసుకెళ్లాలంటూ వైద్యులు సలహా ఇచ్చారు. వైద్యుల సలహా మేరకు బాలింతను పేట్ల బురుజు ఆసుపత్రిలోనే ఉంచారు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ తాను ఆయానంటూ నిర్మల, ఆమె తల్లి కల్పనకు పరిచయమయింది.

శిశువును తీసుకుని ఆయాతో సహా కల్పన నిలోఫర్‌ ఆసుపత్రికి చేరుకుంది. అత్యవసర కేసు కావడం తో తొలుత శిశువుకు ఎక్స్‌రే తీశారు. ఆదివారం సెలవు దినం కావడంతో వెంటనే శిశువును చూసే వైద్యులు అందుబాటులో లేరు. ఎక్స్‌రేను వైద్యులకు చూపించాల్సి ఉండటంతో అక్కడే కూర్చున్నారు. ఉదయం నుంచి కల్పన ఏమీ తినకపోవడంతో శిశువును ఆయా వద్ద ఉంచి టీ తాగి వస్తానని బయటికి వచ్చింది. ఆసుపత్రి బయటి గేటు వద్దకు వచ్చి టీ తాగి వెళ్లి చూడగా శిశువు, ఆయా కనిపించలేదు. ఆసుపత్రి ప్రాంగణమంతా కలియతిరిగినా ఆయా కానరాలేదు. దీంతో బాధితురాలు నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.సంజయ్‌ కుమార్‌ ఇతర పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లిన తన బిడ్డను ఎవరో కిడ్నాప్‌ చేశారన్న విషయం తెలుసుకున్న నిర్మల తీవ్ర ఆందోళనకు గురైంది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా శిశువు ఆచూకీ లభించలేదు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు