పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? చెప్పినా వినలేదా!

24 Sep, 2018 07:20 IST|Sakshi
అరకులో పరిస్థితిని ఆరా తీస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్,ఎస్సీ రాహుల్‌దేవ్‌ శర్మ, డీఐజీ

సాక్షి, విశాఖపట్నం: అరకు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు డుంబ్రిగుడ మండలంలోని లివిటిపుట్టు గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. వాస్తవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగా పోలీసులకు సమాచారమిస్తారు. అందుకు అవసరమైన బందోబస్తును పోలీసులు సమకూరుస్తారు. ఈనెల 21 నుంచి మావోయిస్టులు విలీన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ తమకు సమాచారం లేకుండా ఎక్కడకూ వెళ్లవద్దని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు. అయినప్పటికీ కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు మారుమూలన ఉన్న లివిటిపుట్టు గ్రామదర్శిని కార్యక్రమానికి ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావుకు ఇద్దరు గన్‌మెన్లు, సోమకు ఒక గన్‌మెన్‌ ఉన్నారు.

వీరిని వెంటబెట్టుకుని గ్రామదర్శినికి పయనమయ్యారు. అరకు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో లివిటిపుట్టు గ్రామం చేరువలోకి వెళ్లేసరికి ఇదే అదనుగా సాయు«ధులైన మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చారు. భారీ సంఖ్యలో ఉన్న సాయుధ మావోయిస్టుల ముందు కేవలం ముగ్గురు గన్‌మెన్లు నిస్సహాయలయ్యారు. గన్‌మెన్ల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు తమ వద్ద ఉన్న తుపాకులతో వారిద్దరిని కాల్చి చంపారు. సాయుధులైన తమకు ముందస్తు సమాచారం ఇచ్చివుంటే పోలీసు సిబ్బందిని పంపేవారమని పోలీసు అధికారులు చెబుతున్నారు. మావోయిస్టుల విలీన వారోత్సవాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలన్న పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వెళ్లి హతమవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు