అమెరికాలో స్థిరపడాలన్న అత్యాశతోనే..

27 Feb, 2020 12:51 IST|Sakshi

నగదు కోసం పారిశ్రామికవేత్త కుమారుడికి ఫోన్‌ కాల్స్‌

కిడ్నాప్‌ చేసి హత్య చేస్తానని బెదిరింపు

పోలీసుల అదుపులో నిందితుడు  

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఓ పారిశ్రామికవేత్త కుమారుడిని కిడ్నాప్‌ చేస్తానని బెదిరించిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సేకరించిన వివరాల మేరకు.. గత నెల 29వ తేదీన గుర్తుతెలియని దుండగుడు నెల్లూరు నగరానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుడి కుమారుడికి ఫోన్‌ చేసి తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని లేకపోతే నిన్ను కిడ్నాప్‌ చేసి హతమారుస్తానని బెదిరించాడు. నగదును ఎక్కడికి, ఎలా తీసుకురావాలి తదితర విషయాలను మళ్లీ ఫోన్‌ చేసి చెబుతానన్నాడు. దీంతో పారిశ్రామికవేత్త జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.రామారావు, దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరమ్మలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

దర్యాప్తు ఇలా..
బెదిరించిన వ్యక్తి వినియోగించిన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండేది. రెండు, మూడురోజులకు ఒకసారి మాత్రమే ఆన్‌చేసి బాధితుడికి ఫోన్‌చేసి నగదు ఇవ్వాలని బెదిరించడం, మళ్లీ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడాన్ని గుర్తించిన పోలీసులు సెల్‌టవర్‌ ప్రాంతాన్ని గుర్తించి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. సెల్‌ఫోన్‌ టవర్‌ ప్రాంతాల్లో ఉన్న పలు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన బృందాలు అతని ఫొటోను సేకరించగలిగాయి. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వాడు? వివరాలు తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ లోకేషన్స్‌ను పసిగట్టారు. సిగ్నల్స్‌ నగరంలోని వీఆర్సీ సెంటర్‌ నుంచి మద్రాస్‌ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, ఫత్తేఖాన్‌పేట తదితర ప్రాంతాల్లో చూపించాయి. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

నగరంలో ఉంటూ..
నిందితుడి బంధువులు, స్నేహితులు కొందరు అమెరికాలో స్థిరపడ్డారు. ఈక్రమంలో తాను కూడా అక్కడికి వెళ్లి స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. నగరంలోని తన స్నేహితుడి గదిలో ఉంటూ అమెరికాకు వెళ్లేందుకు మార్గాలను వెతుకుతున్నాడు. తన స్నేహితుడితో వాలీబాల్‌ ఆడే బడా పారిశ్రామికవేత్త కుమారుడి ఆర్థిక పరిస్థితిని గమనించి ఎలాగైనా ఆ వ్యక్తిని బెదిరించి రూ.2 కోట్లు తీసుకుని అమెరికాకు వెళ్లాలని భావించాడు. దీంతో అతనికి ఫోన్‌చేసి కిడ్నాప్‌ చేస్తానని బెదిరించినట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు