సినీ ఫక్కీలో కిడ్నాప్‌..

8 Feb, 2019 10:19 IST|Sakshi
బంగారం వ్యాపారి లక్ష్మణ్‌ను తీసుకెళ్లిన ఇన్నోవా కారు ఇదే , బాధితుడు లక్ష్మణ్‌

పోలీసుల అప్రమత్తతతో లొంగిపోయిన నిందితులు

చందానగర్‌: చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గౌతమీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన కిడ్నాప్‌ కలకలం రేపింది. గురువారం తెల్లవారు జాము వరకు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. చందానగర్‌ సీఐ రవీందర్‌ తెలిపిన మేరకు.. చందానగర్‌లోని గౌతమీనగర్‌కు చెందిన నూకల లక్ష్మణ్‌(30) ఆరు నెలల క్రితం వరకు జ్యువెలరీ షాపు నిర్వహించాడు. మూడు నెలల క్రితం చార్మినార్‌ ప్రాంతానికి చెందిన దేవేష్‌ అగర్వాల్‌కు వడ్డాణం, మూడు తులాల బంగారాన్ని ఇచ్చాడు. 22 తులాలతో వడ్డాణం చేయగా లక్ష్మణ్‌ 19 తులాలు బాకీ పడ్డాడు. డిసెంబర్‌లో ఆభరణాన్ని తీసుకొచ్చిన లక్ష్మణ్‌ దేవేష్‌కు 19 తులాల బంగారాన్ని ఇవ్వకుండా తిప్పసాగాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దేవేష్‌ అగర్వాల్‌ (29), స్క్రాప్‌ వ్యాపారి,  మహేష్‌ అగర్వాల్‌ (45), బంగారం వ్యాపారి, మహేందర్‌ అగర్వాల్‌ (50)లతో పాటు నిటాష్‌ అగర్వాల్, నిషాద్‌ అగర్వాల్, రోహిత్‌ అగర్వాల్‌లు లక్ష్మణ్‌ ఇంటికి వచ్చారు. దినేష్, లక్ష్మణ్‌లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.తనకు రావాల్సిన బంగారం కానీ, మూడున్నర లక్షల నగదు కావాలని లక్ష్మణ్‌ పై వారు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇన్నోవా కారు ( ఏపీ 37 ఏఎల్‌ 5454)లో లక్ష్మణ్‌ను బలవంతంగా తీసుకొని వెళ్లారు. లక్ష్మణ్‌ భార్య స్వాతి చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఎస్‌ఐ ప్రభాకర్‌రావు కిడ్నాపర్లతో మాట్లాడారు.  విషయం పోలీసులకు తెలిసిపోవడంతో వారు లక్ష్మణ్‌ను రాత్రి ఒంటి గంట ప్రాంతంలో చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ మేరకు దినేష్, మహేష్, మహేందర్‌ అగర్వాల్‌లను  అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. 

సీబీసీఐడీ పోలీసులమంటూపోన్‌లో బెదిరింపులు ...
బంగారం వ్యాపారి లక్ష్మణ్‌ను ఇంటి నుంచి ఇన్నోవా కారులో తీసుకెళ్లగా>నే ఏం చేయాలో తెలియక అతని భార్య స్వాతి, స్థానికంగా ఉండే నాయకుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో మీకు మా అంకుల్‌ డబ్బు సమకూరుస్తాడని ఒక ఫోన్‌ చేసుకుంటానని చెప్పి లక్ష్మణ్‌ కసిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పోన్‌ చేశాడు. నన్ను వీళ్లు కొడుతున్నారు.. డబ్బులు సమకూర్చండి అని చెప్పాడు. మీరు ఎవరు ..? ఎక్కడ ఉన్నారు అని భాస్కర్‌రెడ్డి ప్రశ్నించగా సీబీసీఐడీ పోలీసులమని పోన్‌లోనే వారు భాస్కర్‌రెడ్డిని బెదిరించారు.  వెంటనే చందానగర్‌ పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో నూకల స్వాతి తన భర్తను కి డ్నాప్‌ చేశారని ఫిర్యాదు చేసింది. స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐ ప్రభాకర్‌రావు పోన్‌లో మాట్లాడి నేను చందానగర్‌ నుంచి ఎస్‌ఐను మాట్లాడుతున్నానని వారిని హెచ్చరించగా భయపడిన వారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో లక్ష్మణ్‌ను చార్మినార్‌ పోలీసులకు అప్పగించేందుకు వెళ్లారు. పోలీసులు దేవేష్, మహేందర్, మహేష్‌ అగర్వాల్‌లను అక్కడే కూర్చోబెట్టి చందానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. చందానగర్‌ పోలీసులు వెళ్లి లక్ష్మణ్‌తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

లక్ష్మణ్‌కు గాయాలు..
బంగారం వ్యాపారిని ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆరుగురు అతనిని తీవ్రంగా గాయపరిచారు. రాత్రి 10.30 గంటల నుండి చందానగర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వాహనంలో తిప్పుకుంటూ కొట్టడంతో తలకు తీవ్రగాయాలు కావడంతో ఆరు కుట్లు వేశారు.

మరిన్ని వార్తలు