కిడ్నాప్‌ కాదు.. వారే వెళ్లారు

5 Jun, 2019 13:03 IST|Sakshi

వీడిన పెరవలి కిడ్నాప్‌ కేసు

ఆర్థిక ఇబ్బందులతో ఊరు వదిలి వెళ్లారు

18 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

పెరవలి: పెరవలి మండలం పెరవలిలో ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్‌ గురైయ్యారని విషయం తీవ్ర సంచలనం రేపటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేవలం 24 గంటలు గడవక ముందే వారిని పట్టుకున్నారు. పెరవలికి చెందిన తోట పార్వతి లలితాంబ (35), ఈమె కుమారుడు ధన వీర వెంకట్‌ (6), కుమార్తె  కోటేశ్వరి (15) కలసి సోమవారం పుట్టింటికి ఆటోలో వెళుతుండగా కిడ్నాప్‌ చేశారని భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల నుంచి పలు రకాల విచారణ చేసిన పోలీసులు అనంతరం వీరిని పట్టుకోవటానికి ప్రత్యేకంగా మూడు టీమ్‌లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో సిద్ధాంతం, గోపాలపురం వద్ద ఉన్న టోల్‌గేట్, రావులపాలెం బస్టాండ్, తణుకు, తాడేపల్లిగూడెం వద్ద టోల్‌గేట్‌ల వద్ద సీసీ ఫుటేజ్‌లను తీసుకున్నారు. వాటిని సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వి.జగదీశ్వరరావు పరిశీలించగా వారిని ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, వారే స్వచ్ఛందంగా వెళ్తున్నట్టు గుర్తించారు. పోలీస్‌ బృందాలను పంపించి పట్టుకున్నారు. ఎస్సై జగదీశ్వరరావు మాట్లాడుతూ వారు ముగ్గురూ ఆటోలో రావులపాలెం బస్టాండ్‌కు వెళ్లారని, అక్కడి నుంచి విజయవాడ బస్‌ ఎక్కారన్నారు. విజయవాడలో మరో బస్‌ ఎక్కి కడపలోని బ్రహ్మంగారిమఠం వెళ్లారని చెప్పారు. అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారని, తమ సిబ్బంది వెళ్లి వారిని తీసుకువస్తున్నట్టు తెలిపారు. అప్పుల బాధ తాళలేక వారే వెళ్లిపోయారని తమ విచారణలో తేలిందన్నారు.

పోలీసుల పనితీరుపై ప్రశంసలు
కిడ్నాప్‌కు గురైన ముగ్గురు వ్యక్తుల జాడ కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టి కేవలం 18 గంటల్లోనే వారు ఎక్కడ ఉన్నదీ తెలుసుకున్నందుకు స్థానికులు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు