అచ్చంపేటలో కిడ్నాప్‌ కలకలం   

22 Jun, 2018 12:21 IST|Sakshi
బాలికతో కలిసి ఉమామహేశ్వరం సమీపంలోని అడవిలో పరిశీలిస్తున్న పోలీసులు, నాయకులు  

కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నానంటున్న బాలిక

నల్లమల అడవిలో  విస్తృతంగా గాలింపు

ఎలాంటి ఆచూకీ  లభించలేదంటున్నపోలీసులు

అచ్చంపేట రూరల్‌ : పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్‌ చేశారంటూ పుకార్లు షికార్లు చేశాయి. పట్టణంలో నూతనంగా ఏర్పాటైన పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్‌ చేశారని బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లగా.. పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రులు  పాఠశాల, పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు.

ఎలాంటి సమాచారం దొరకకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత బాలిక ఇంటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడికి వెళ్లావని బాలికను ఆరా తీస్తే పాఠశాల సమీపంలో ముసుగులు వేసుకున్న కొందరు తనను వెనక నుంచి కళ్లు మూసి కిడ్నాప్‌ చేశారని, వారి నుంచి తప్పించుకుని వచ్చానని బాలిక తల్లిదండ్రులు, పోలీసులకు చెప్పింది. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు బాలికతో గాలింపు చేపట్టారు.

ఉమామహేశ్వరం వెళ్లే దారిలో కుడివైపు తీసుకెళ్లారని చెప్పడంతో అడవిలో, కుంచోనిమూల ప్రాంతంలో కొంత వరకు పోలీసులు కాలినడకన వెళ్లి చూసినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. తనతోపాటు నలుగురు అమ్మాయిలను ఒక వాహనంలో, మరో వాహనంలో 10 మందికిపైగా బాలికలు ఉన్నట్లు బాలిక పోలీసులకు చెప్పడంతో అడవిలో పోలీసులు పరుగులు పెట్టారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆచూకీ కోసం తిరిగినా ఎలాంటి సమాచారం లభించలేదని, అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించామని అచ్చంపేట పోలీసులు తెలిపారు.

బాలిక చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని పోలీసులు తేల్చిచెప్పారు. పుకార్లను నమ్మవద్దని ఎస్‌ఐలు పరశురాం, విష్ణు కోరారు. పోలీసులతోపాటు అడవి ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింహగౌడ్, రఘురాం, రహ్మతుల్లా, సాయిరెడ్డి తదితరులు సమాచారం కోసం తిరిగారు.

మరిన్ని వార్తలు