ఆరూష్‌ ఎక్కడ?

27 Jul, 2019 07:28 IST|Sakshi
ఆరూష్‌ కోసం దీనంగా ఎదురు చేస్తున్న అశోక్‌రెడ్డి దంపతులు, చిత్రంలో ఆరూష్‌ రెడ్డి 

ఉత్కంఠ రేపుతున్న బాలుడి అదృశ్యం ఉదంతం

జిల్లా పోలీసులపై పెరిగిన ఒత్తిడి

ప్రత్యేక బృందాలతో గాలింపు

బాలుడు ఏలూరులో దొరికాడంటూ ప్రచారం

అవన్నీ వదంతులేనని తేల్చిన పోలీసులు

సాక్షి, దర్శి టౌన్‌: రెడ్డినగర్‌ బాలుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడటం లేదు. నెల రోజులుగా ఆచూకీ లేని రెండేళ్ల బాలుడి వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఆ బిడ్డ తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతోంది. కిడ్నాప్‌నకు గురైన తూర్పుగోదావరి జిల్లా మండపేట బాలుడు ఆచూకీ లభించిన నేపథ్యంలో ఆరూష్‌ కేసు విషయంలో జిల్లా పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో శుక్రవారం ఆరూష్‌ను ఏలూరులో గుర్తించారనే వార్తలు గుప్పుమనడంతో కన్నవారి ప్రాణం లేచి వచ్చినట్టయింది. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అంతలోనే అవన్నీ వదంతులేనంటూ పోలీసులు స్పష్టం చేశారు. 

ముండ్లమూరు మండలం ఉల్లగల్లు పంచాయతీ పరిధిలో రెడ్డినగర్‌కు చెందిన   అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల రెండేళ్ల కుమారుడు ఆరూష్‌రెడ్డి 33 రోజుల కిందట ఇంటి ముంగిట ఆడుకుంటూ అదృశ్యం కాగా ఇంత వరకు అతడి ఆచూకీ లభించలేదు.  అతడి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులను కలిసి, న్యాయం చేయాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈక్రమంలో రెండు రోజులుగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి శుక్రవారం వివిధ ప్రాంతాలలో ఆరా తీశారు. వ్యక్తిగత వివాదాల కారణంగా స్థానికులే ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

బాబు దొరికాడనే వదంతులతో కలకలం
శుక్రవారం రాత్రి ఆరూష్‌రెడ్డి ఏలూరు ఇందిరానగర్‌లో దొరికినట్లు జరిగిన ప్రచారం  స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో బాలుడి బంధువులు ఉత్కంఠతో ఎదురు చేశారు. తమ బాబు దొరికాడంటూ ఆనందపడ్డారు. అవన్నీ వదంతులేనంటూ తేలటంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఏలూరులోని ఒక ఇంట్లో బాలుడు ఉన్నాడని సమాచారంతో అక్కడి పోలీసులు వెళ్లారని, కానీ ఎవరూ లేకపోవడంతో బాలుడి జాడ తెలియలేదని  దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు వివరించారు. అన్ని కోణాలలో విచారణ వేగవంతం చేశామన్నారు.

మరిన్ని వార్తలు