అప్పనంగా కిడ్నీలు కొట్టేస్తున్నారు

2 Apr, 2019 03:57 IST|Sakshi

ఈజిప్టు, టర్కీ, శ్రీలంకలో అవయవాలు మార్పిడి చేస్తున్న ముఠా 

ఫేస్‌బుక్‌లో పోస్టులు, డబ్బులిస్తామంటూ ఒప్పందాలు, ఆపై ఎగవేత 

ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి కోటి వరకు వసూళ్లు 

ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్జాతీయ ముఠాకు సంకెళ్లు

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కిడ్నీ దాతలు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో(ఎస్‌ఓఎస్‌ఐఎంఎస్‌.కామ్‌ వంటి సైట్ల ద్వారా) చేసిన పోస్టుకు స్పందించిన దాతలకు కుదుర్చుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ముంబై, ఢిల్లీలో పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ప్రధాన నిందితుడు, భోపాల్‌ వాసి అమ్రిష్‌ ప్రతాప్‌ తప్పించుకుపోవడంతో లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకొని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆదివారం అప్పగించారు. అతడికి సహకరించిన ఢిల్లీవాసి రింకీ, నోయిడా వాసి సందీప్‌ కుమార్‌లను కూడా ట్రాన్సిట్‌ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 40 వరకు బలవంతపు కిడ్నీల మార్పిడిలు చేసినట్టుగా అనుమానిస్తున్న ఈ ముఠా వివరాలను నాగోల్‌లోని రాచకొండ పోలీసు కమిçషనర్‌ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్‌ భగవత్‌ సోమవారం మీడియాకు తెలిపారు. భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ ఫేస్‌బుక్‌లో పోస్టును చూసిన నగరవాసి స్పందించి రూ.20లక్షలకు ఇచ్చేందుకు అంగీకరించాడు.  ఈ ముఠా అతడిని ఈజిప్టు తీసుకెళ్లి బలవంతంగా కిడ్నీ మార్పిడి చేసి డబ్బులు ఇవ్వలేదు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

భార్య బాగు కోసం మోసాలబాట... 
ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడిన భోపాల్‌కు చెందిన అమ్రిష్‌ ప్రతాప్‌ అలియాస్‌ అంబారిష్‌ చిన్నతనంలోనే అమ్మనాన్నలను కోల్పోవడంతో తాత, నాన్నమ్మల వద్ద పెరిగాడు. 2006లో హిమాంగి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు నాడీ సంబంధిత సమస్యలు రావడంతో ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో చికిత్సకోసం దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆర్థిక సమస్యల్లో పడ్డాడు. వీటని అధిగమించేందుకు తొలుత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగాల్లో పనిచేసిన అమ్రిష్‌ ప్రతాప్‌ మెడికల్‌ టూరిజమ్‌కు మారాడు. తొలుత చట్టవ్యతిరేకంగా అద్దెకు తల్లులు(సరోగసీ విధానం) నుంచి మొదలెట్టి ఆ తరవాత మానవ అవయవాల మార్పిడి వ్యాపారంవైపు మళ్లాడు. ఇలా డాక్టర్లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు, ప్రభుత్వ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసపు దందాకు తెరలేపాడు. డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారి అవయవాలు మార్పిడి చేసి డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఢిల్లీ వాసి రింకి, నోయిడా వాసి సందీప్‌ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. టర్కీలో కిడ్నీ ఇచ్చేందుకు వచ్చిన సమయంలో సందీప్‌ కుమార్‌ ఈ మోసం గురించి తెలుసుకొని తానుకూడా అమ్రిష్‌ ప్రతాప్‌తో చేయికలిపి డబ్బు అవసరమున్న వారిని గుర్తించి ఇతడి చేతిలో పెట్టాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి కోటి వరకు రోగుల నుంచి ఈ ముఠా తీసుకునేది.ఇలా ఈ ముఠా రోగులు, దాతలను శ్రీలంకలో కొలంబోలొరి వెస్టర్న్‌ ఆస్పత్రి, ఈజిప్ట్‌ కైరోలోని అల్‌ ఫహద్‌ హాస్పిటల్, టర్కీ ఇజ్మిర్‌లోని కెంట్‌ ఆస్పతుల్లో 40 వరకు కిడ్నీ మార్పిడీలు చేశారు.  

డబ్బులివ్వకపోవడంతో వెలుగులోకి మోసం.. 
సందీప్‌ కుమార్‌ ఫేస్‌బుక్‌ ఖాతా రోహన్‌ మాలిక్‌ పేరుతో సృష్టించి భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ చేసిన పోస్టు చూసిన రాచకొండ కమిషనరేట్‌ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు వారిని సంప్రదించారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముఠాసభ్యుడొకరు వాట్సాప్‌లో బాధితుడితో సంప్రదింపులు జరిపాడు. రూ.20లక్షలు ఇస్తామంటూ ఆశ చూపాడు. ఢిల్లీకి రావాలంటూ ముఠా సభ్యులు అతనికి రైలు టికెట్‌ బుక్‌ చేశారు. గత జులై 20న అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్‌లో ఉంచారు. ఢిల్లీ మరికొన్నిచోట్ల వైద్య పరీక్షలు జరిపించారు. బాధితుడు రోగి బంధువుగా ధ్రువీకరణపత్రం సృష్టించారు. అనంతరం వైద్య వీసాపై అతణ్ని ఆగస్టులో టర్కీకి తీసుకెళ్లారు. అయితే శస్త్రచికిత్సకు ముందు డబ్బు ఇవ్వాలని బాధితుడు పట్టుబట్టడంతో అతని పాస్‌పోర్టు లాక్కొని బెదిరింపులకు దిగారు. అతడు భయపడటంతో శస్త్రచికిత్స చేయించి కిడ్నీ తీసేశారు.

ఆ ముఠా బారి నుంచి బయటపడి హైదరాబాద్‌కు చేరుకున్న బాధితుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇది అంతర్జాతీయ ముఠా పనిగా గుర్తించారు. అమ్రిష్‌ ప్రతాప్‌ను పట్టుకోవడానికి ఢిల్లీ, ముంబైకి వెళ్లగా తప్పించుకొనిపోయాడు. అయితే లుక్‌ అవుట్‌ నోటీసు జారీతో ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సింగపూర్‌ నుంచి వచ్చిన అమ్రిష్‌ ప్రతాప్‌ను పట్టుకొని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. అతడిచ్చిన సమాచారంతో వారిని ట్రాన్సిట్‌ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. వీరిని పోలీసు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు.అమ్రిష్‌ ప్రతాప్‌పై 2016లో నల్గొండలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాయిగూడెం పోలీసు స్టేషన్‌లలో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు. దుబాయ్, వియత్నాం, చైనా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్, ఇండోనేసియా, మెక్సికోకు కూడా వెళ్లొచ్చని, అక్కడ కూడా కిడ్నీ మార్పిళ్లు ఏమైనా చేశాడా అనే విషయాలు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తెలుస్తాయని సీపీ అన్నారు. 

మరిన్ని వార్తలు