జాతీయ ‘రక్త’దారి..

13 Aug, 2019 08:53 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మహిళ

సాక్షి, తూర్పుగోదావిరి : జాతీయ రహదారులు రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. జిల్లాలో గోపాలపురం నుంచి తుని వద్ద గల పాయకరావు పేట వరకు 140 కిలో మీటర్లు ఉన్న జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జాతీయ రహదారి గోతులమయం కావడం, రహదారుల వెంబడి మద్యం షాపుల ఏర్పాటు, ప్రమాదకర మలుపులు, గ్రామాలను కలుపుతూ వెళ్లిన జంక్షన్ల వద్ద సరైన రక్షణ ఏర్పాటు చేయకపోవడం, మద్యం మత్తులో, నిద్ర మత్తులో, లైసెన్స్‌ లేని డ్రైవర్లు సైతం జాతీయ రహదారులపై హేవే వాహనాలు డ్రైవింగ్‌ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా గత టీడీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారమే ప్రధాన ఆదాయంగా నిబంధనలు తుంగలో తొక్కి లైసెన్స్‌లు ఇచ్చేసింది.

దీంతో మద్యం సేవించి లారీ డ్రైవర్లు, హే టెక్‌ బస్సు డ్రైవర్లు, ఇతర వానం డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. హైవేలపై పర్యవేక్షణ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు మాముళ్ల మత్తులో వాహనాలు తనిఖీలు నిర్వహించకుండానే వదిలి వేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్సులు ఇచ్చే సమయంలో ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించకుండా జారీ చేయడంతో రోడ్డు ప్రమాదాలకు అవి కూడా కారణమవుతున్నాయి. గత మూడేళ్లలో 1,490 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 419 మంది మృతి చెందారు. 1,653 మందికి గాయాలయ్యాయి. ఏటా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని వందలాది మంది ప్రజాలు ప్రాణాలు కోల్పోతున్నా హైవే అథారిటీ అధికారులు కళ్లు తెరవడం లేదు. 

గోతులను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు
జాతీయ  రహదారిలో గోతులు పడడంతో వేగంగా వెళ్లే వాహనాలు వాటిని తప్పించుకునే క్రమంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు వాహనం గోతుల నుంచి తప్పించేందుకు కొంత పక్కకు తిప్పడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనం ఢీ కొని రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల ఐదో తేదీ సోమవారం దివాన్‌చెరువు ఆటోనగర్‌ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొత్త వెలుగు బంద గ్రామానికి చెందిన మరుకుర్తి శ్రీనివాస్, లక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గోతులను తప్పించే క్రమంలో వెనుక వైపు నుంచి లారీ వచ్చి వారిని ఢీ కొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి పిల్లలు అనాథలయ్యారు.

తాజాగా ఆదివారం జరిగిన రాజానగరం శివారు శ్రీరామనగర్‌ వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజానగరం మండలం తోకాడకు చెందిన భార్యాభర్తలు రాయుడు నరసింహ మూర్తి, అతడి భార్య సత్యవతి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తమ కుమారుడు గోవింద్‌తో కలిసి బైక్‌పై శ్రీరామ్‌నగర్‌లోని బంధువుల ఇంట జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. వీరిని జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్‌ నడుపుతున్న గోవిందుతో పాటు వెనుక కూర్చున భార్యాభర్తలు ఎగిరి కిందపడడంతో వారి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాలు నిత్యం హైవేలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.

డేంజర్‌ జంక్షన్లు
జిల్లాలో జాతీయ రహదారి 140 కిలో మీటర్లు ఉండగా జాతీయ రహదారిపై నుంచి పట్టణాలు, నగరాలకు వేళ్లే మార్గాలు, అప్రోచ్‌ రోడ్లు,  ఇతర జంక్షన్లలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుని పరిధిలో జగన్నాథగిరి, గవరయ్య కోనేరు సెంటర్, తేటగుంట సెంటర్, సి.ఇ చిన్నాయ పాలెం, బెండపూడి, కత్తిపూడి, రామవరం, గండేపల్లి, మల్లేపల్లి, రాజానగరం, రాజమహేంద్రవరం లాలా చెరువు, మోరంపూడి సెంటర్, బొమ్మూరు జంక్షన్, కడియం, రావుల పాలెం తదితర ప్రాంతాల్లో డేంజర్‌ జంక్షన్లు ఉన్నాయి. హైవేకు అప్రోచ్‌ రోడ్లు ఉండడం వలన నగరాల నుంచి హైవేకు వెళ్లే మార్గాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెంటర్లలో సరైన రక్షణ చర్యలు చేపకట్టకపోవడం, జాతీయ రహదారికి సంబంధం లేకుండా బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

గోతులు పూడుస్తున్నాం 
జాతీయ రహదారిలో ప్రతిరోజూ రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటిపారుదల శాఖ వారు బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్లు అప్రోచ్‌ డైవర్షన్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కడియపు లంక నుంచి దివాన్‌ చెరువు వరకూ ఐదు టీమ్‌లు ఏర్పాటు చేసి వర్షానికి ఏర్పడిన గోతులు యుద్ధప్రాతిపదికన  పూడుస్తున్నాం. – శ్రీనివాసరావు, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌

గోతులతో రోడ్డు ప్రమాదాలు
జాతీయ రహాదారి పై ఏర్పాడిన గోతుల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో పోటు అప్రోచ్‌ రోడ్లు, జంక్షన్లు వద్ద ఒక్క సారిగా రోడ్డు పైకి వాహనాలు వేగంగా వచ్చేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జంక్షన్‌లలో ట్రాఫిక్‌ పోలీసులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాము. డ్రంకన్‌ డ్రైÐŒ , వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నాము. 
– ఎస్‌. వెంకట్రావు, ట్రాఫిక్‌ డీఎస్పీ,రాజమహేంద్రవరం అర్బన్‌

మరిన్ని వార్తలు