ఈ కత్తి యమ డేంజర్‌!

26 Oct, 2018 05:31 IST|Sakshi
కత్తిని పోలీసులకు అందజేస్తున్న పార్టీ నేతలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి కత్తులు చాలా డేంజర్‌.. మామూలుగా ఉపయోగించే చాకు, కత్తుల కన్నా ఇవి అత్యంత పదునుగా ఉంటాయి. దీంతో దాడి జరిగితే ప్రాణాలకే ప్రమాదం. అసలు దాడి జరిగిందని తెలుసుకునేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదముంది. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి చాలా పదునుగా ఉంది. ఇటీవలే కత్తిని సానపట్టినట్లు కనపడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ కత్తులను కోడి పందేలతో పాటు పథకం ప్రకారం జరిగే దొమ్మీలలోనూ, హత్యల్లోనూ వాడతారు. ఇది దిగిన వారికి కూడా తెలియలేనంత పదునుగా ఉంటుంది. హత్య చేయడం కోసమే ఈ కత్తిని తీసుకువచ్చినట్లు తాజా ఘటనతో స్పష్టమవుతోంది. వీటిని సామాన్యులు పట్టుకోవడానికి కూడా భయపడతారు. అటువంటిది దాడిచేసిన వ్యక్తి దాన్ని జేబులోంచి తీసి దాడిచేసిన విధానం చూస్తే పక్కా ప్రణాళికతోనే వచ్చినట్లు అర్ధమవుతోంది. మెడను లక్ష్యంగా చేసుకుని దాడిచేయడం చూస్తుంటే ఖచ్చితంగా ప్రాణాలు తీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు కోడి కత్తులపై బాగా అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. 

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బిట్‌తో తయారీ
సాధారణంగా కోడిపందేల సమయంలో కోడి కాళ్లకు ఈ కత్తులను కడతారు. చాలా పదునుగా ఉండే వీటిని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బిట్‌ అనే మెటల్‌తో తయారుచేస్తారు. వీటికి ఎక్కువసార్లు సానబడతారు. ఈ కత్తి పదునుకు నరం తెగితే ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఉదా.. ఈ ఏడాది సంక్రాంతి కోడి పందేల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగెడిగూడెంకు చెందిన వ్యక్తి పందెం కోడిని పట్టుకునే ప్రయత్నంలో కత్తి తొడకు తగిలి నరం తెగి ఆసుపత్రికి వెళ్లేలోగా చనిపోయాడంటే అది ఎంత ప్రమాదమో అర్ధమవుతుంది. 

నల్లమందు, కొంగల మందు,పాదరసంతో పదును
ఈ కత్తుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బరక కత్తి, రెండు సాన కత్తి. సాన కత్తి పాలిష్‌ ఎక్కువగా పడితే ఇది బ్లేడ్‌ కన్నా ఎక్కువ పదునుగా ఉంటుంది. వీటిని అంగుళంన్నర నుంచి రెండున్నర అంగుళాల సైజ్‌లో తయారుచేస్తారు. వీటికి ఉండే పిడి నాలుగు అంగుళాల వరకూ ఉంటుంది. వీటిని పదును పెట్టే సమయంలో నల్లమందు, కొంగల మందుతో పాటు పాదరసం కూడా రాసి ఎండ పెడతారు. ఒక్కోసారి పాదరసంలో ముంచి కూడా సానబెడతారు. అలా పెట్టడంవల్ల మెటల్‌ విషపూరితమవుతుంది. ఆ కత్తి తగిలితే వెంటనే  ప్రాణంపోయే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ కత్తులు ఉపయోగించడం అందరికీ రాదు. కోడి పందాలలో వినియోగించే కత్తులకు పూస పూస్తే పందెంలో దెబ్బతిన్న కోడి వెంటనే మరణిస్తుంది. పూస అనేది ఒక పదార్ధాన్ని అరగదీసి తయారుచేసే పదార్ధం. కత్తికి పదును ఎక్కువగా ఉండటంతో, ఆ ఆయుధంతో ఎవ్వరినైనా పొడిస్తే. చూడటానికి చిన్న గాయంగా కనిపించినా, రోజులు గడిచేకొద్దీ గాయం ప్రభావం శరీరంపై, అవయవాలపై తీవ్రంగా చూపిస్తుంది.

కోడిపందేలు లేవుగా కోడి కత్తెందుకు?
కోడిపందేలు ఇప్పుడేమీ లేవు, పైగా నువ్వు కోడి పందేలూ ఆడవు. కోడి కత్తి నీకెందుకు అన్న తయారీదారు ప్రశ్నకు... నాకు ప్రత్యేకంగా పని ఉందిలే అని శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పి తీసుకెళ్లాడు. సుమారు నెల కిందట కోడి కత్తి తయారీదారుడు, వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణను స్థానికులు గుర్తు చేస్తున్నారు. దీన్నిబట్టి పక్కా ప్రణాళికతోనే శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు కొన్నాళ్ల కిందట శ్రీనివాసరావు సోదరుని కుమార్తె పుట్టినరోజు పండుగ జరిగింది. ఆ సందర్భంగా అయిన వారికి, స్నేహితులకు శ్రీనివాసరావు ధూంధాంగా పార్టీ ఇచ్చారని గ్రామస్తులు గుర్తుచేశారు. వాస్తవంగా అంత పెద్దమొత్తంలో ఖర్చుపెట్టే ఆర్థిక స్థోమత శ్రీనివాసరావుకు లేదని చెపుతున్నారు. వైఎస్‌ జగన్‌పై దాడికి శ్రీనివాసరావును ఎంపిక చేసుకున్నట్లు, భారీగా డబ్బులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు