పోలీసుల అదుపులో కోడెల బినామీ! 

25 Oct, 2019 08:46 IST|Sakshi

మూడు నెలలుగా పరారీలో ప్రసాద్‌ 

సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్‌ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు.  పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్‌ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్‌ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్‌ పేరిట రాయించినట్లు తెలిసింది. 

భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు
మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో  భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్‌ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 

మరిన్ని వార్తలు