యాసిడ్‌ దాడి బాధితురాలి పోరాటం

27 Mar, 2018 19:41 IST|Sakshi
సంచయిత యాదవ్‌ (ఇన్‌సెట్‌లో ఆమె పూర్వపు చిత్రం)

కోల్‌కతా: ఆమె నాలుగేళ్ల పోరాటం ఫలించింది. తనపై యాసిడ్‌తో దాడిని దుర్మార్గుడిని కటకటాల వెనక్కునెట్టింది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగేళ్ల క్రితం చోటుచేసుకున్న యాసిడ్‌ దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

సంచయిత యాదవ్‌(25) బెంగాల్‌లోని డుండుంలోని సెత్‌బగాన్‌ ప్రాంతంలో 2014లో సోమెన్‌ సాహా అనే యువకుడి చేతిలో యాసిడ్‌ దాడికి గురైంది. తన తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ‍ఆమెపై యాసిడ్‌ పోశాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో తన తల్లిముందే సంచయితపై సాహా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పోరాటం తర్వాత నిందితుడిని అరెస్ట్‌ చేయించగలిగింది.

పూర్తిగా కాలిపోయిన ముఖంతో మానసికంగా ఎంతో కుంగిపోయానని, తన తల్లి​ సహాయంతో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేశానని సంచయిత తెలిపింది. నాలుగేళ్లనుంచి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగినా ఎవరు తమను పట్టించుకోలేదని, తనకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదన్న ఉద్దేశంతో పోరాటం చేశానన్నారు.

యాసిడ్‌ దాడి బాధితుల తరుఫున పోరాడే ఎన్‌జీవోల సహాయంతో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కలిసి 2017లో బెంగాల్‌ హైకోర్టును ఆ‍శ్రయించినట్టు వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు డండం పోలీసులు ఆదివారం సోనార్‌పూర్‌లో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని చూసిన సంచయిత పట్టరాని కోపంతో అతడి చెంప చెళ్లుమనిపించింది. నాలుగేళ్లుగా ఎంతో క్షోభ అనుభవించానని, తన జీవితాన్ని నాశనం చేసిన సాహా మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతుండటంతో కోపాన్ని ఆపులేకపోయినట్టు ఆమె వివరించింది. తన పోరాటం ఆగిపోలేదని, నిందితుడికి శిక్ష పడేవరకు తన పోరాటం ఆపనని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు