తల్లడిల్లుతున్న ఏడు పల్లెలు

13 Sep, 2018 08:22 IST|Sakshi
బస్సులు లేక అంత్యక్రియల కోసం ట్రాక్టర్‌లో తరలివస్తున్న మృతుల బంధువులు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/సాక్షి, జగిత్యాల: ఓ ప్రమాదం 60 నిండు ప్రాణాలను బలిగొంది. తల్లీబిడ్డలను వేరు చేసింది. సురక్షితం అనుకున్న ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలను అనం త వాయువులో కలిపేసింది. ఎప్పుడు వెళ్లే దారే అయినా.. అదే చివరి ప్రయాణమని ఎవరూ ఊహించలేదు. పనులు చేసుకుని తిరిగొద్దామనుకున్నారు. కానీ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అంజన్న సాక్షిగా జరిగిన పెను ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఎన్నో కుటుంబాలను వీధిన పడేసింది. 60 కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కోదీనగాధ.. ఆ ఏడు గ్రామాలలో మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలే..  ఏఊళ్లో చూసినా కన్నీటి ధారలే.. ఎక్కడ చూసినా వెక్కివెక్కి ఏడ్చేవాళ్లే. శనివారంపేటలో వీధులన్నీ విషాదంలో నిండిపోయాయి. 
ఒక్కో సంఘటన హృదయ విదారకం... విషాదంలో కుటుంబాలు

  • శనివారం పేటకు చెందిన వరలక్ష్మి బంధువులను కలిసేందుకు కుమారుడితో కలిసి జగిత్యాలకు వెళ్లుతుంది. కొండగట్టు దాటాక కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఈలోపే బస్సు లోయలో పడటంతో అక్కడికక్కడే మరణించింది. కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్యను కోల్పోయి భర్త, తల్లి కోల్పోయి కూతురు విలపిస్తున్నారు.
  • డబ్బు తిమ్మాయిపల్లెకు చెందిన వొడ్నాల కాశీ రాం, లక్ష్మి వృద్ధ దంపతులు జ్వరంతో బాధపడుతున్న కాశీరాం దంపతులు వైద్యం కోసం జగిత్యాలకు వెళ్లుతుండగా ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయా రు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. డబ్బుతిమ్మయ్యపల్లెలో ఒక వీధి లో నలుగురు మృతితో విషాదం అలముకుంది.
  •  
  • తిర్మలాపూర్‌కు చెందిన తైదల పుష్ప, దుర్గమ్మ కూతురు అర్చన, భవానీలు, పుష్ప బీడీలు చుడుతూ పిల్లల్ని చదివించుకుంటుంది. ఆరోగ్యం బాగోలేని చిన్న కుమార్తె అర్చనను వెంట పెట్టుకోని జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో తల్లి మృత్యువాత పడగా అర్చన తీవ్రంగా గాయపడి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
  • తిర్మలాపూర్‌కు చెందిన పడిగెల స్నేహలత డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అన్ని ఉద్యోగాలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా భావించి కంప్యూటర్‌ శిక్షణ కోసం కరీంనగర్‌ వస్తుండగా బస్సు ప్రమాదం కబళించింది. మృతురాలు తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలు, కుమారున్ని చదివిస్తున్నాడు. పెళ్లీడుకు వచ్చిన కూతురు మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
  •  
  • కొడిమ్యాల మండలం రాంసాగర్‌కు చెందిన గడ్డం రామస్వామిది వ్యవసాయ కుటుంబం. ఆయన 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం భార్య అనితతో కలిసి ఆసుపత్రికి వెళ్తూ ప్రమాదంలో కన్ను మూశాడు. అనిత కాళ్లు, చేతులు విరిగి చికిత్స పొందుతుంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
  •  రాంసాగర్‌కు చెందిన మేడి చెలిమెల సత్తయ్య భార్య గౌరు బీడీలు చుడుతూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారున్ని పోషిస్తుంది. మల్యాలలోని సోదరున్ని చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తల్లి మృతితో ఆ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు.
  • కొడిమ్యాల మండలం కోనాపూర్‌కు చెందిన లత జ్వరంతో బాధపడుతున్న కుమార్తె నందనకు చికిత్స కోసం జగిత్యాలకు బయలుదేరింది. బస్సు ప్రమాదంలో తల్లి తీవ్రంగా గాయపడగా, కూతురు నందన అక్కడికక్కడే మృతి చెందింది. జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి పక్కనే స్ట్రెచర్‌పై విగతజీవిగా ఉన్న కుమార్తె మృతదేహన్ని పోల్చుకోలేక నా బిడ్డ ఎక్కడుంది అంటూ ఆరా తీయడం అందరినీ కలచివేసింది. 
  • విషాదం నింపిన ప్రమాదం..

కొండగట్టు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నిలిపింది. శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లి, రాంసాగర్, తిర్మలాపూర్, సంద్రాలపల్లి, రాంపల్లి, కోనాపూర్‌ ఏడు గ్రామాలు మరుభూములుగా మారాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు, చదువుకునే విద్యార్థులు, గర్భిణులు, వృద్ధుద్దులు, వివిధ పనుల కోసం జగిత్యాలకు వెళ్లుతున్న యువతీ యువకులు మహిళలు ఇలా ఎందరో ప్రాణాలు విడిచారు.

కొడుకును కోల్పోయిన తండ్రి, కూతురిని కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎటు చూసినా విషాదమే.. ఎవరిని కదిపినా కన్నీళ్లే నిన్నటి వరకు సంతోషంగా ఉన్న ఆ పల్లెలు ఇప్పుడు తమ వారిని తలుచుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాయి. మృతుల్లో 40 మంది నాలుగు ఊళ్లకు చెందిన వారే. ఒక్క శనివారంపేటలోనే 15 మంది అసువులు బాశారు. ఆ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినారోదనలే. హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లి, రాంసాగర్‌లోను అదే పరిస్థితి. ఏ ఊళ్లో చూసినా కన్నీటి ప్రవాహమో.. ఏ పల్లెను కదిలించినా ఎవరితో మాట్లాడినా వెక్కివెక్కి ఏడ్చేవారే.   

మరిన్ని వార్తలు