ప్రభుత్వం రూ.5 లక్షలు, ఆర్‌టీసీ రూ.3 లక్షలు

11 Sep, 2018 18:39 IST|Sakshi
కొండగట్టు బస్సు ప్రమాదం

సాక్షి, కొండగట్టు : ఆర్‌టీసీ బస్సు చరిత్రలోనే ఘోర ప్రమాదం. జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్‌ రోడ్డులో  ప్రయాణిస్తున్న ఆర్‌టీసీ బస్సు 25 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 57 మంది దుర్మరణం పాలయ్యారు.  33 మంది గాయాలు పాలయ్యారు. ప్రమాదం సంభవించిన సమయంలో 88 మంది  ఆ బస్సులో ఉన్నట్టు తెలిసింది. బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.  దీంతో కొండ ప్రాంతమంతా ఆక్రందనలతో మిన్నంటింది. ఆర్‌టీసీ తప్పిదం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు మండిపడుతున్నారు. 

చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించింది. ఆర్‌టీసీ తరుఫున కూడా మృతులకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించనున్నట్టు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. చనిపోయిన వారిలో రైతులు ఉంటే నష్టపరిహారంతో పాటు రైతు బీమా వర్తింపజేస్తామని ఆర్థిక శాఖ ఆపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు టీఆర్‌ఎస్ సభ్యత్వం ఉన్నవారికి రూ.2 లక్షలు అదనంగా ఇస్తామన్నారు. దీంతో మృతుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల సహాయం అందేలా చూస్తామని ఈటెల హామీ ఇచ్చారు. గాయపడ్డ వారందరికీ పూర్తిస్థాయిలో చికిత్స ప్రభుత్వమే అందిస్తుందన్నారు. 

ప్రమాదం సంభవించిన స్థలిని ఆపద్ధర్మ మంత్రులు మహేందర్ రెడ్డి, కేటీఆర్‌, ఎంపీ కవిత సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను మంత్రులు పరామర్శించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగిత్యాల డిపో మేనేజర్‌ హనుమంతరావును సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరుఫున అన్ని వైద్య  సదుపాయాలు కల్పిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 
 

మరిన్ని వార్తలు